హిందూ ముస్లిం భాయిభాయి అనేందుకు నిదర్శనంగా కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో ఆలయ నిర్మాణం జరిగింది. ముస్లిం సామాజికవర్గానికి చెందిన ఓ వ్యక్తి.. ఒకే ప్రాంగణంలో ఆలయంతోపాటు దర్గాను నిర్మించాడు. జిల్లాలోని గంగావతి తాలుకా బసపట్టణ గ్రామానికి చెందిన అబూ సాహెబ్.. పుట్టుకతోనే శారీరక వైక్యలం బారినపడ్డాడు. జీవనోపాధి కోసం హిత్నలా గ్రామంలో పంక్చర్ షాప్‌ను నిర్వహిస్తున్నాడు. అయితే అతడికి ఒకరోజు రాత్రి నిద్రిస్తున్న సమయంలో అంబా దేవి కలలోకి వచ్చిందట. తనకు ఆలయాన్ని నిర్మించాలని కోరిందట. దీంతో అతడు ఆలయం నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని స్థానికులతో తెలిపాడు.
స్థానికులు, భక్తుల సహాయంతో అబూ సాహెబ్.. ఐదు నెలల క్రితం ఒకే ప్రాంగణంలో ఆలయంతోపాటు దర్గాను నిర్మించాడు. అంతే కాకుండా అప్పటి నుంచి ప్రతి రోజు అమ్మవారికి పూజలు చేస్తున్నాడు. అబూసాహెబ్ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ.. హిందు సంప్రదాయాల ప్రకారం పూజలను చేయడం వల్ల భక్తులు అతడిని ప్రశంసిస్తున్నారు. అబూ మంత్రాలు చదివిన తీరు.. ప్రత్యేకంగా ఉంటుందని మహిళా భక్తులు చెబుతున్నారు. కొన్నినెలల క్రితం.. ఆధ్యాత్మిక నగరమైన కాశీలో ఓ ముస్లిం మహిళ శివాలయాన్ని నిర్మించారు.
వారణాసిలోని గణేశ్‌పూర్ రుద్రబిహార్ కాలనీకి చెందిన నూర్ ఫాతిమా వృత్తిపరంగా అడ్వకేట్. ముస్లిం అయినప్పటికీ ఆమె శివభక్తురాలు. 2004లో ఆమె తను ఉండే కాలనీలో శివాలయాన్ని కట్టించారు. స్థానికులు ఇక్కడ పూజలు చేయడం ప్రారంభించారు. అయితే ఆ గుడి చిన్నగా ఉన్నందువల్ల అక్కడ కూర్చుని భజన చేసేందుకు భక్తులు ఇబ్బందులు పడేవారు. ఇది చూసిన నూర్ వారి కోసం ఏదైనా చేయాలనుకున్నారు. దీంతో ఆలయం ముందు ఓ మండపాన్ని నిర్మించారు. ఇప్పుడు అందరూ అక్కడ కూర్చుని భజనలు చేస్తున్నారు.