ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై బుధవారం రెండో రోజు చర్చ కొనసాగింది. చర్చలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో అమిత్ షా ప్రసంగిస్తూ మణిపూర్ ఘటనలు సిగ్గుచేటని అంగీకరిస్తూనే.. విపక్షాలకు కౌంటర్ ఇచ్చాడు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా.. అవిశ్వాసంపై రెండోరోజు కూడా వాడీవేడీ చర్చ సాగింది. సాయంత్రం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటన అనంతరం.. లోక్‌సభ గురువారానికి వాయిదా పడింది.
అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ సందర్భగా హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ.. రోజులో 17 గంటలు పని చేసే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే విపక్షాలు అవిశ్వాస తీర్మానం ముందుకు తీసుకొచ్చాయని మండిపడ్డారు. ఈ అవిశ్వాస తీర్మానానికి ప్రజల్లో మద్దతు లేదని .. కేవలం గందరగోళం సృష్టించేందుకు.. ప్రజల దృష్టిని మళ్లించేందుకు తీసుకొచ్చారని విమర్శించారు. ప్రజలు బీజేపీ ప్రభుత్వం పట్ల అమితమైన విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. అవిశ్వాసం ఒక రాజ్యాంగ ప్రక్రియ.. చర్చకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పైగా అవిశ్వాసంతో కూటముల బలమెంతో తెలుస్తుందని అన్నారు. ప్రజలకు అంతా తెలుసునని.. వాళ్లు అంతా చూస్తున్నారని చెప్పిన అమిత్ షా.. ప్రజలకు తమపై పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు.