అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు ఎక్స్(ట్విటర్)లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. దాదాపు రెండున్నర ఏళ్లకు పైగా ట్రంప్ ఎక్స్(ట్విటర్)వాడలేదు. 2021లో అమెరికా అధ్యక్ష కార్యాలయం వద్ద జరిగిన అల్లర్లలో ట్రంప్ పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ట్విటర్ ఖాతాను అప్పట్లో నిలిపివేశారు. దీంతో ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేసుకున్నారు. దాని పేరు ట్రూత్. దాని ద్వారానే ట్రంప్ తాను చెప్పాలనుకున్న మెసేజ్ ను కన్వే చేసేవారు. ఆ తరువాత పరిస్థితులు మారడంతో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎలాన్ మస్క్ ట్విటర్ ను కొనుగోలు చేశారు. అప్పుడే ట్రంప్ ఖాతాను పునరుద్దరిస్తామంటూ సంకేతాలు కూడా ఇచ్చారు. అయితే ట్రంప్ మాత్రం మళ్లీ ట్విటర్ ను ఉపయోగించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎక్స్(ట్విటర్)పై ట్రంప్ కోపం అప్పటికీ తగ్గలేదు కాబోలు.
ఇదిలా వుండగా 2024 అధ్యక్ష ఎన్నికల కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రధాన అభ్యర్థిగా ఉన్నారు డోనాల్డ్ ట్రంప్. దాని ప్రచారం కోసమో లేక మరేదైనా కారణమో తెలియదు కానీ అకౌంట్ నిషేధించిన తరువాత ఈరోజు తొలిసారిగా ట్రంప్ ఎక్స్(ట్విటర్)లోకి అడుగుపెట్టారు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే జార్జియా పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ట్రంప్ ఈ పోస్ట్ పెట్టారు. 2021 జనవరి తరువాత తాను చేసిన తొలి ట్వీట్ లో ట్రంప్ తన మగ్ షాట్ షేర్ చేశారు. మగ్ షాట్ అంటే తమ రికార్డుల కోసం పోలీసులు తీసుకునే ఫోటో. దీనిని పోస్ట్ చేస్తూ ‘మగ్ షాట్ ఆగస్ట్ 24, 2023’ పేరుతో ట్రంప్ కామెంట్ కూడా పెట్టారు. ‘ఎన్నికల జోక్యం.. లొంగేది లేదు’ అనే క్యాప్షన్ జోడించారు. అంతేకాకుండా డోనాల్డ్ ట్రంప్ డాట్ కామ్ పేరుతో తన వెబ్ సైట్ చిరునామాను కూడా అక్కడ ఉంచారు ట్రంప్. ఇక దీనిపై ట్వీటర్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. నెక్ట్స్ లెవల్ అంటూ రిప్లై ఇచ్చారు. 2021 జనవరి తరువాత ట్రంప్ చేసిన తొలి ట్వీట్ ఇది. కాగా ఈరోజు ఉదయం ట్రంప్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.