మనకి ప్రకృతి ఇచ్చిన ఆరోగ్యవరాలలో ఆకు కూరలు చేసే అద్భుతాలెన్నో. శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను ప్రోటీన్లను, అందిస్తూ… నిత్యం తమని ఏదో ఓరకంగా తీసుకునే వ్యక్తుల జీవనశైలినే మార్చేసే సత్తా ఆకుకూరలకు ఉంది. ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉండటమే కాకుండాతినే ఆహారాన్ని రుచి కరంగా చేసేదిగా ప్రత్యేక లక్షణాన్ని ఆకుకూరలు కలిగి ఉంటాయి. ఆకు కూరలు వండుకునే ముందు ఖచ్చితంగా ఒకటికిరెండు సార్లు కడగటం మంచిది. ఎందుకంటే వాటిలో చేరే చిన్న చిన్న పురుగులు, ధుమ్మూ,ధూళి మనఆరోగ్యానికి హాని కలిగించ వచ్చు. ఇలా పలు రకాల ఆకుకూరలు వండేముందు కాస్త ఉప్పువేసిన మంచి నీటిలొ ముంచితే వాటిపై ఉండే క్రిమికీటకాలు, గుడ్లు, నాశనమవుతాయి.
పచ్చని ఆకు కూరలను మీ ఆహారం నుండి ఎప్పుడూ మినహాయించరాదు. ప్రతిరోజూ వాటిని తినాల్సిందే. శుభ్రం చేయటం, తరగటం, వండటం కష్టమని వాటిని మానరాదు. ఆకుకూరలు అతి చౌకగా లభించే అన్ని పోషక విలువలుగల ఆహా రం. అనేక రకాల ఆకుకూరలు మనకు లభ్యమవుతున్నాయి. తోట కూర, కొయ్యతోటకూర, అవిశాకు, బచ్చలి, మెంతికూర, కొత్తిమీర, కరి వేపాకు, మునగాకు, గోంగూర, చింతచిగురు, పొన్నగంటి, పాలకూర, చుక్కకూరను ఎక్కువగా వాడాలి. ఆయాకాలంలో చౌకగా దొరికే ఆకు కూరలను ప్రతిరోజు ఏదో రూపంలో వాడడం మంచిది.
ఉదా పుదీనా పచ్చడి, గోంగూర పప్పు, పెసర పప్పు, పాలకూర, కరివేపాకు పొడి, ఆకుకూర పకోడి, బచ్చలి-బజ్జి మొదలైనవి ఆకుకూరలు మంచి పౌష్టికకరమైన ఆహారం. వీటిలో క్యాల్షియం, ఇనుము, విటమిన్ ‘ఎ’, ‘సి’, రైబోఫ్లెవిన్, ఫోలిక్‌యాసిడ్ మరియు పీచు ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరల్లో విటిమిన్ ఎ, కె మరియు ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని రక్షిస్తుంది మరియు శాస్వ సంబంధిత సమస్యలను, యూరినరీ మరియు పేగు సంబంధిత సమస్యలను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతాయి.