శ్రీశైల మహా క్షేత్రంలో అమావాస్య ప్రత్యేక పూజలు అర్చక వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అత్యంత శక్తివంతుడు, మహిమాన్వితుడైన క్షేత్ర పాలకుడు బయలు వీరభద్రస్వామికి మంగళవారం ప్రదోషకాల సమయంలో పంచామృతాలు, ఫలోదకాలు, పసుపు కుంకుమ విభూది గంధ జలాలు, బిల్వోదక సుగంధ ద్రవ్యాలు, శుద్దజలాలతో అభిషేకాలు, విశేష పుష్పార్చన, మహా నైవేద్య కార్యక్రమం నిర్వహించారు. ఈవో ఎస్ లవన్న ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక పూజలు చేశారు.
ప్రతి మంగళవారం, అమావాస్య రోజుల్లో స్వామివారికి అభిషేకార్చనలు నిర్వహిస్తున్నామని ఈవో లవన్న అన్నారు. ఆరు బయట ఆలయంలో దర్శనమిచ్చే స్వామిని పూజించడం వల్ల భూతప్రేత పిశాచ దుష్ట గ్రహ దోషాలు తొలిగి సర్వ కార్యానుకూలతతోపాటు ఆయురారోగ్యాలు సిద్దిస్తాయని అర్చకులు తెలిపారు. ప్రతి నెలా వచ్చే అమావాస్య రోజుల్లో సేవాకర్తలు తమ గోత్ర నామాలను srisailadevasthanam.org వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమాన్ని శ్రీశైల టీవీ ఛానల్ సాంఘిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. దేవస్థానం వివరాలను తెలుసుకునేందుకు కాల్‌సెంటర్ 8333901351, 2, 3, 4, 5, 6 నంబర్‌లలో సంప్రదించాలని కోరారు. శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ప్రధానాలయ ప్రాకారంలోని కుమారస్వామికి, నందీశ్వరునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు అర్చనలు చేశారు.
శ్రీశైల క్షేత్రానికి వచ్చే యాత్రికులకు కల్పిస్తున్న సౌకర్యాలతోపాటు నిత్యం దేవస్థానంలో జరిగే కార్యకలాపాల నిర్వహణలో క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరును మెరుగుపడాలని ఈవో లవన్న చెప్పారు. సిబ్బంది విధుల నిర్వహణపై సమర్థవంతమైన పర్యవేక్షణ జరిగేలా చూడాల్సిన భాద్యత ప్రతి అధికారిపై ఉందన్నారు. మంగళవారం పరిపాలనా భవనంలో విభాగాధిపతులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గణాంక, రెవెన్యూ, ఇంజనీరింగ్, వసతి, ఆలయం, పారిశుద్యం, అన్నప్రసాద వితరణ, ప్రచురణలు, ప్రసాదాల తయారీ, ఉద్యానవన విభాగాలలో క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
విధుల నిర్వహణలో అలసత్వం వహించడం సమంజసంకాదని ఈవో లవన్న అన్నారు. అలాగే సాంకేతిక పరిఙ్ఞానం పెంపొందించుకుంటూ ఫేషియల్ అటెండెన్స్ ఉండే విధానాన్ని అందరూ అలవర్చుకోవాలని తెలిపారు. దేవస్థాన రాబడి, వ్యయాలపై ప్రతి అధికారి అవగాహన కలిగి ఉండాలన్నారు. తద్వారా సౌకర్యాల కల్పనకు వెచ్చించే ఒక్కరూపాయి కూడా వృధా కాకుండా యాత్రికులకు వసతులు కల్పించాలని చెప్పారు. వర్షాకాలం ముగిసేలోపు క్షేత్ర పరిధిలో మెక్కలు నాటి పచ్చదనాన్ని అభివృద్ది చెయ్యాలని పేర్కొన్నారు