కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలోని జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే వ్యవహారంపై అలహాబాద్ హైకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. న్యాయ ప్రయోజనాల కోసం సర్వే జరగాల్సిన అవసరం ఉందంటూ గురువారం ఉదయం తీర్పు వెలువరించింది. మసీదు ఆవరణలో సర్వే నిర్వహించి నివేదిక సమర్పించాలంటూ వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. తక్షణమే సర్వే కొనసాగించేందుకు ఓకే చెప్పింది.
జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని వారణాసి జిల్లా కోర్టు జులై 21న తీర్పు వెలువరించింది. కోర్టు ఆదేశాల మేరకు భారత పురావస్తు విభాగ అధికారుల బృందం జులై 24న సర్వే ప్రారంభించింది. దీన్ని వ్యతిరేకిస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం సర్వేపై రెండు రోజుల పాటు స్టే విధించింది. వారణాసి కోర్టు తీర్పుపై మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టుకు వెళ్లొచ్చని సూచించింది. ఈ నేపథ్యంలోనే వారణాసి కోర్టు తీర్పును సవాల్ చేస్తూ మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. ఏఎస్‌ఐ సర్వేపై స్టే విధించి తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తాజాగా మసీదు కమిటీ పిటిషన్‌ను కొట్టివేస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. తక్షణమే సర్వే ప్రారంభించేందుకు ఏఎస్‌ఐకి అనుమతినిచ్చింది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో నేటి నుంచి మళ్లీ మసీదు ప్రాంగణంలో ఏఎస్‌ఐ బృందం సర్వేను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
మొగల్ కాలంలో హిందూ ఆలయ స్థానంలో ఈ మసీదు నిర్మించారని, ఈ విషయాన్ని సర్వే నిర్వహించి తేల్చాలని కోరుతూ నలుగురు హిందూ మహిళలు పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన వారణాసి కోర్టు.. మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని ఉత్తర్వులిచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్ చేసిన వాజూఖానా ప్రాంతాన్ని మినహాయించి మసీదు ప్రాంగణమంతా కార్బన్ డేటింగ్, ఇతర పద్ధతుల ద్వారా శాస్త్రీయ సర్వే నిర్వహించాలని భారత పురావస్తు విభాగాన్ని ఆదేశించింది. ఇప్పుడు ఈ ఉత్తర్వులను హైకోర్టు కూడా సమర్థించింది.