కోకోపేట్.. కెవ్వు కేక అంటోంది. అవును మరి… కోకాపేటా మజాకా..! రియలెస్టేట్ రంగంలో మళ్లీ అదరగొట్టింది కోకాపేట. కోకాపేట భూముల ధరలు కేక పుట్టిస్తున్నాయి. అంచనాలకు మించి.. రికార్డులు తిరగరాస్తూ.. రేట్లు పలుకుతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన వేలం ప్రక్రియలో హాట్ కేకుల్లా ప్లాట్లు అమ్ముడుపోతున్నాయి. కోకాపేట నియోపోలీస్ భూములు వేలంలో ఎకరం భూమి ధర రూ.100.75కోట్లు పలికి ఆల్టైమ్ రికార్డు సృష్టించింది.
హైదరాబాద్లోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరున్న కోకాపేటలో హెచ్ఎండీఏ భూముల వేలం జరుగుతోంది. కోకాపేటలోని నియో పోలిస్ ఫేజ్-2లో భూములు రికార్డు స్థాయిలో ధర పలికాయి. నియో పోలస్లో హెచ్ఎండీఏ ఎకరం భూమికి రూ.35 కోట్లుగా ధరను నిర్ణయించగా.. ఈ భూముల వేలంలో దిగ్గజ స్థిరాస్తి సంస్థలు పోటీపడ్డాయి. వేలంలో అత్యధికంగా ఎకరం భూమి ధర రూ. 72 కోట్లు.. అత్యల్పంగా రూ. 51.75 కోట్లు పలికింది. అయితే ఈరోజు ఉదయం తొలి విడతలో చేపట్టిన 6,7,8,9 ఫ్లాట్ల వేలం ముగియగా.. ఫ్లాట్లు అంచనాలకు మించి ధర పలికాయి. నాలుగు ప్లాట్ల వేలంలో అత్యధికంగా ఒక ఎకరం దాదాపు రూ. 72 కోట్లు పలకగా.. అత్యల్పంగా రూ. 51 కోట్లు పలికింది. గజం సరాసరి రూ. 1.5 లక్షలు పలికింది. మొత్తంగా నాలుగు ప్లాట్ల వేలంలో హెచ్ఎండీఏకు రూ. 1,532.5 కోట్ల భారీ ఆదాయం సమకూరింది.
ఇక సాయంత్రం సెషన్లో కోకా పేట భూముల ధరలు రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త చరిత్రను తిరగరాశాయి. దేశంలోకెల్లా అత్యంత ఖరీదైన భూమి కోకాపేటదే అని తేలిపోయింది. కోకాపేట నియోపోలీస్ భూముల వేలంలో ఎకరం రూ. వంద కోట్లు దాటి ఆల్టైమ్ రికార్డు సృష్టించింది. సాయంత్రం సెషన్ విషయానికొస్తే.. ప్లాట్ నెంబర్ 10లో ఎకరం భూమి ధర రూ.100.75కోట్లు పలికి ఆల్టైమ్ రికార్డు సృష్టించింది. ప్లాట్ నెంబర్ 11లో ఎకరం రూ. 58.25 కోట్ల ధర పలికింది.