తిరుపతి జిల్లా శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం మరో కీలక ప్రయోగానికి సన్నద్ధమైంది. ఇది విజయవంతమైతే సూర్యుని అన్వేషణలో భారత్ అగ్ర భాగాన నిలవనుంది. ఇందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అహరహం ప్రయోగ పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం అందరిచూపు శ్రీహరికోట వైపు మళ్లింది. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) అంతటా సందడి నెలకొంది. మొన్న చంద్రయాన్-3ని చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా చేర్చిన ఇస్రో శాస్త్రవేత్తల్లో మరింత హుషార్ కనిపిస్తోంది. ఇప్పటికే షార్‌కు ఇస్రోలోని వివిధ కేంద్రాల సంచాలకులు, సీనియర్ శాస్త్రవేత్తలు, ఇస్రో మాజీ అధిపతులు విచ్చేశారు. ప్రయోగాన్ని వీక్షించేందుకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్రసింగ్ షార్‌కు చేరుకున్నారు. అతిథి భవనంలో కొద్దిసేపు శాస్త్రవేత్త లతో ముచ్చటించారు. ప్రయోగ వీక్షణకు పలు రాష్ట్రాల నుంచి వీవీఐపీలు, వీఐపీలు రానున్నారు.
సూర్యుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తొలిసారిగా చేపడుతోన్న ఆదిత్య ఎల్ 1 ప్రయోగానికి కౌంట్‌డౌన్ కొనసాగుతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్‌లో ఈ ప్రయోగానికి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 23 గంటల 40 నిమిషాల కౌంట్‌డౌన్ అనంతరం శనివారం ఉదయం 11 గంటల 50 నిమిషాలకు ఆదిత్య-ఎల్ 1 ఉపగ్రహాన్ని మోసుకుని PSLV-C57 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి మిషన్ ఇదే కావడం విశేషం.
తొలుత ఆదిత్య ఎల్-1ను భూమధ్యంతర కక్ష్యలో ప్రవేశపెడతారు. భూమి నుంచి సూర్యుని దిశగా 15లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లగ్రాంజ్ పాయింట్ 1కు చేరుకునేందుకు దీనికి 125 రోజుల సమయం పట్టనుంది. లగ్రాంజ్ పాయింట్ వద్ద సూర్యుడు, భూమి గురుత్వాకర్షణ శక్తి సమానంగా ఉంటుంది. అక్కడ ఎక్కువ కాలం సూర్యుడిపై పరిశోధనలు చేయవచ్చు. గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు లభిస్తుంది. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో సూర్యుడిపై అధ్యయనాలను ఇస్రో చేపడుతోంది.