వచ్చేనెలలో సెప్టెంబర్ 9,10 తేదీల్లో జరగనున్న జీ20 సదస్సుకు ఆతిధ్యం ఇచ్చేందుకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. అతిధులు, ప్రతినిధుల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు బస కోసం ఢిల్లీలోని హోటళ్లను బుక్ చేశారు. ఢిల్లీ, ఎన్‌సీఆర్ పరిధిలోని 30కిపైగా హోటళ్లలో పలు దేశాధినేతలు, ప్రతినిధులకు రూమ్‌లను బుక్ చేశారు. వీటిలో ఢిల్లీ నగరంలోని ఐటీసీ మౌర్యా, తాజ్ మాన్‌సింగ్, తాజ్ ప్యాలెస్, హోటల్ ఒబెరాయ్, హోటల్ లలిత్, ది లోధీ, మెరిడీయన్, హయత్ రీజెన్సీ, షంగ్రి లా, లీలా ప్యాలెస్, హోటల్ అశోక, ఎరోస్ హోటల్, ది సూర్యా, రాడిసన్ బ్లూ ప్లాజా, జేడబ్ల్యూ మారియట్, ది లీలా యాంబియన్స్ కన్వెన్షన్, ది ఇంపీరియల్ తదితర హోటళ్లు ఉన్నాయి. ఇక ఎన్‌సీఆర్ పరిధిలోని వివంత, ఐటీసీ గ్రాండ్, తాజ్ సిటీ సెంటర్ హయత్ రీజెన్సీ ది ఒబెరాయ్ తదితర హోటళ్లున్నాయి.
ప్రభుత్వ వర్గాల కథనం ప్రకారం ఐటీసీ మౌర్యాలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ బస చేయనున్నారు. ఇక్కడ అన్ని ఫ్లోర్లు అమెరికా సీక్రెట్ సర్వీస్ కమాండోల ఆధీనంలోకి వెళ్లనున్నాయి. ఈ హోటల్ 14 వ అంతస్తులో బైడెన్ బస చేసే గది ఉంది. ఆ ఫ్లోర్ చేరడానికి ప్రత్యేకంగా లిఫ్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఈ హోటల్లో 400 గదులను అతిథుల కోసం బుక్ చేశారు. ఇక హోటల్ షంగ్రి-లాలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, క్లారిడ్జెస్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, ఇంపీరియల్ హోటల్‌లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ఆతిథ్యం స్వీకరించనున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సదస్సుకు హాజరైతే తాజ్ ప్యాలెస్‌లో ఆయనకు విడిది ఏర్పాటు చేశారు. ఇదే హోటల్‌లో బ్రెజిల్ నుంచి వచ్చే అతిథులు కూడా ఉంటారు. దిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో తుర్కియే దౌత్య బృందాలు బసచేయనున్నాయి. మారిషస్, నెదర్లాండ్స్, నైజిరీయా, స్పెయిన్ బృందాలు లా మెరీడియన్ హోటల్‌లో ఉండనున్నాయి. ఇప్పటికే యూకే, అమెరికా, చైనా నుంచి లైజనింగ్ బృందాలు భారత్‌కు చేరుకొన్నాయి.
విదేశీ అతిథుల రక్షణ బాధ్యతలను సెంట్రల్ పారామిలటరీ, ఎన్‌ఎస్‌జీ కమాండో, ఢిల్లీ పోలీస్ బృందాలు చూసుకొంటున్నాయి. వీటిల్లో ఒక్కో బృందానికి ప్రత్యేక బాధ్యతలను అప్పగించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు బైడన్ కూడా ఢిల్లీకి రానుండటంతో ఆ దేశానికి చెందిన సీక్రెట్ సర్వీస్ బృందాలు కూడా మూడు రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేయనున్నాయి. ఇప్పటికే హోంశాఖ జీ-20 సదస్సు భద్రతపై పలు సమీక్షా సమావేశాలు నిర్వహించింది. అతిథుల రక్షణ బాధ్యతలను చూసుకోవడంపై సీఆర్‌పీఎఫ్‌లోని 1,000 మంది సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు.