టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా మాజీ ఆల్‌రౌండర్ అజిత్ అగార్కర్ నియమితుడయ్యాడు. భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ అతణ్ని ఎంపిక చేసినట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించాడు. ‘‘సులక్షణ నాయక్, అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపెలతో కూడిన క్రికెట్ సలహా కమిటీ సెలక్షన్ కమిటీలో ఖాళీ అయిన ఒక స్థానానికి ఇంటర్వ్యూలు నిర్వహించింది. కమిటీ ఏకగ్రీవంగా అగార్కర్‌ను ఎంపిక చేసింది. అనంతరం మిగతా సెలక్టర్లతో పోలిస్తే ఎక్కువ అంతర్జాతీయ అనుభవం ఉన్న అతడినే సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ప్రతిపాదించింది’’ అని షా ఒక ప్రకటనలో తెలిపాడు. కొన్ని నెలల కిందట చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ భారత జట్టులో పలువురు ఆటగాళ్ల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో బయటికి రావడంతో తన పదవికి రాజీనామా చేశాడు. ఇప్పుడా స్థానాన్ని అగార్కర్ భర్తీ చేయనున్నాడు.
టీమిండియా సెలెక్టర్ల ప్యానెల్లో ఇప్పటికే శివ్ సుందర్ దాస్, సలీల్ అంకోలా, సుబ్రతో బెనర్జీ, ఎస్ శరత్ సభ్యులుగా ఉన్నారు. ఐదో సభ్యుడిగా అజిత్ అగార్కర్ చేరాడు. 26 టెస్టులు, 191 వన్డేలు, 4 టీ-20 మ్యాచులాడిన అగార్కర్, ప్యానెల్లో సీనియర్ మోస్ట్ సభ్యుడిగా చేరారు. ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ జరుగనున్న నేపథ్యంలో టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా అగార్కర్ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.
45 ఏళ్ల అజిత్ అగార్కర్ 1998-2007 మధ్య 191 వన్డేలు, 26 టెస్టులు, 4 టీ20లు ఆడాడు. ఈ మూడు ఫార్మాట్లలో వరుసగా 288, 58, 3 వికెట్లు పడగొట్టాడు. అగార్కర్ 1999, 2003, 2007 వన్డే ప్రపంచకప్‌ల్లో భారత జట్టు సభ్యుడు. 2007 టీ20 ప్రపంచకప్ నెగ్గిన జట్టులోనూ అతనున్నాడు. ప్రధానంగా బౌలరే అయినప్పటికీ.. లార్డ్స్‌లో టెస్టు శతకం సాధించిన అరుదైన ఘనత అగార్కర్ సొంతం. అంతే కాక భారత్ తరఫున వన్డేల్లో వేగవంతమైన అర్ధశతకం సాధించిన రికార్డు కూడా అగార్కర్‌దే. 2000లో జింబాబ్వేపై అతను 21 బంతుల్లోనే 50 చేశాడు. 2004లో ఆస్ట్రేలియాపై అడిలైడ్ టెస్టులో భారత్ సాధించిన చారిత్రక విజయంలో అగార్కర్ పాత్ర కీలకం. ఆ మ్యాచ్‌లో అతను 6 వికెట్ల ప్రదర్శన చేశాడు. రిటైర్మెంట్ తర్వాత అగార్కర్ చాలా ఏళ్ల నుంచి క్రికెట్ విశ్లేషకుడిగా, వ్యాఖ్యాతగా కొనసాగుతున్నాడు.
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. వెస్టిండీస్‌తో జరగనున్న ఐదు టీ-20ల సిరీస్ కోసం జట్టును ఎంపిక చేయనుంది. వచ్చే ఏడాది టీ-20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో సీనియర్లను పక్కన పెట్టి.. కుర్రాళ్లపై ఫోకస్ చేసే అవకాశం ఉంది. దీంతో ఈ విషయాన్ని అగార్కర్ డీల్ చేయనున్నాడు. టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా ఎంపికైన అగార్కర్.. గతంలోనూ ఇదే తరహా విధులు కొంత కాలం నిర్వర్తించాడు. 2017-2019 మధ్యలో ముంబయి జట్టు సెలక్టర్‌గా ఉన్నాడు.