హింసతో గత మూడు నెలలుగా తగలబడిపోతున్న మణిపూర్ ఇంకా కుదుటపడటం లేదు. మరోసారి మణిపూర్ లో హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలో గత రాత్రి పొద్దుపోయాక జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మృతి చెందారు. వీరు క్వాక్టా ప్రాంతానికి చెందిన మెయిటీ తెగకు చెందినవారు. ఈ ఘటన తర్వాత కుకీ తెగకు చెందిన వారి ఇళ్లకు దుండగులు నిప్పుపెట్టారు. మెయిటీ ప్రాంతాల నుంచి బఫర్ జోన్‌ను దాటుకుని వచ్చిన కొందరు వ్యక్తులు ఇళ్లకు నిప్పు పెట్టినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. బిష్ణుపూర్ జిల్లాలోని క్వాక్టా ప్రాంతానికి రెండు కిలోమీటర్లకుపైగా దూరంలో ఉన్న బఫర్‌జోన్ వద్ద పోలీసులు, కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. ఇదే జిల్లాలో రెండ్రోజుల క్రితం మెయిటీ తెగ ప్రజలు, సాయుధ బలగాల మధ్య జరిగిన గొడవల్లో 17 మంది గాయపడ్డారు. తమపైకి దూసుకొచ్చిన ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు, సాయుధ బలగాలు టియర్ గ్యాస్‌ను ప్రయోగించాయి. ఇదే జిల్లాలో రెండ్రోజుల క్రితం మెయిటీ తెగ ప్రజలు, సాయుధ బలగాల మధ్య జరిగిన గొడవల్లో 17 మంది గాయపడ్డారు. కాగా, మణిపూర్ లో దాదాపు 3 నెలలుగా జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటి వరకు 160 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాదిమంది గాయపడ్డారు.
క్వాక్టా ప్రాంతంలో భద్రతా బలగాలు, ఆందోళనకారుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని అధికారిక వర్గాల సమాచారం. ఈ కాల్పుల్లో మణిపుర్ కమాండో ఒకరు గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. అటు పారామిలిటరీ బలగాలు భారీగా మోహరించాయి. ప్రస్తుతం బిష్ణుపుర్‌లో పరిస్థితులు క్లిష్టంగానే ఉన్నాయని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇదే బిష్ణుపుర్‌లో గురువారం రాత్రి అల్లరిమూకలు రెచ్చిపోయి ఆయుధాలను లూటీ చేసిన విషయం తెలిసిందే. నారన్సీనా ప్రాంతంలో రెండో బారత రిజర్వు బెటాలియన్ (ఐఆర్‌బీ) ప్రధాన కార్యాలయంలోని పోలీసు ఆయుధాగారంపై దాడి చేసి భారీగా ఆయుధ సామగ్రిని ఎత్తుకెళ్లారు. అంతకుముందు రెండు రోజుల క్రితం భద్రతాబలగాలు, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుని 17 మంది గాయపడ్డారు.