డ్రాగన్ కంట్రీ చైనా తన తీరుమార్చుకోవడం లేదు. భారత్‌పై నిత్యం అక్కసు వ్యక్తం చేస్తూ, సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచుతోంది. ఇప్పటికే గాల్వాన్ లోయ సమీపంలోని పాంగాంగ్‌త్సో సరిస్సు వద్ద గలాటా సృష్టిస్తున్న చైనా ఇప్పుడు మరో కొత్త పన్నాగానికి తెర లేపింది.
ఇదిలా ఉంటే చైనా మరోసారి భారత భూభాగాలను తనవిగా చూపిస్తూ కొత్త మ్యాపులను విడుదల చేసింది. భారత భూభాగాలైన అక్సాయ్ చిన్, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలను తన భూభాగాలుగా చూపుతోంది. చైనా ఇటీవల తన దేశపు ప్రామాణిక మ్యాపులను రిలీజ్ చేసింది. ఆగస్ట్ 28న విడుదల చేసిన ఈ మ్యాపు దౌత్యపరమైన ఆందోళనలకు కారణం అవుతోంది. చైనా అధికార మ్యాప్, 2023 ఎడిషన్ గా కొత్త మ్యాపులను రిలీజ్ చేసింది. చైనా సహజ వనరుల మంత్రిత్వి శాఖ స్టాండర్డ్ మ్యాప్ సర్వీస్ వైబ్‌సైట్ ద్వారా వీటిని ప్రచురించింది. కొత్తగా విడుదల చేసిన మ్యాపులను చైనా గ్లోబల్ టైమ్స్ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. అరుణాచల్‌లోని 11 ప్రాంతాలు తమ భూభాగమే అంటూ ఎడిషన్ ఆఫ్ ది స్టాండర్డ్ మ్యాప్ ఆఫ్ చైనా-2023 పేరుతో మ్యాప్ తయారీ చేసింది. డిజిటల్, నేవిగేషన్ మ్యాప్ విడుదల చేస్తామని ప్రకటించింది డ్రాగన్ కంట్రీ.
చైనా అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాన్ని దక్షిణ టిబెట్ గా పేర్కొంటోంది. 1962 యుద్దంలో జమ్మూా కాశ్మీర్ ప్రాంతంలోని అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుంది. ఈ భూభాగం కూడా తమదే అని మ్యాపుల్లో చూపిస్తోంది. ఇదిలా ఉంటే భారతదేశం పలు సందర్భాల్లో అరుణాచల్ భారత్ లో భూభాగమే అని ఇది మారదని చెబుతోంది. ఇక డ్రాగన్ కంట్రీ తైవాన్ భూభాగాన్ని కూడా తమదే అని చూపిస్తోంది. దక్షిణ చైనా సముద్రంలో చాలా భూభాగాన్ని తమదే అని చెబుతోంది. ఇటు భారత్ తో పాటు అటు తైవాన్, వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రూనై దేశాలతో సరిహద్దు తగాదాలను పెట్టుకుంది.