జాబిల్లిపైకి చేరుకునేందుకు భారత్ ప్రయోగాలు చేస్తుండగానే.. రష్యా మరో రాకేష్ ని చంద్రుడు పైకి ప్రయోగించింది. దాదాపు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి ‘లునా – 25’ పేరుతో రాకెట్‌ను రష్యా నింగిలోకి దూసుకెళ్లింది. ఆ దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్కాస్మోస్ విడుదల చేసిన చిత్రాల ప్రకారం.. మాస్కోకు తూర్పున 3,450 మైళ్ల దూరంలోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్ ప్రాంతం నుంచి శుక్రవారం వేకువజామున 2.10 గంటలకు ‘లునా – 25’ నింగిలోకి దూసుకెళ్లింది. కేవలం ఐదు రోజుల్లోనే ఇది చంద్రుడి కక్ష్యలోకి చేరనుంది. ఆ తర్వాత చంద్రునిపై ఎవరూ చేరని దక్షిణ ధ్రువంలో.. మరో 3 లేదా 7 రోజుల్లో ల్యాండర్‌ను ల్యాండ్ చేసేలా రష్యా ప్రణాళికలు రచిస్తోంది. ఆపై చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ టెక్నాలజీస్ అభివృద్ధి, జాబిల్లి ఉపరితలంపై పరిశోధనలు, అక్కడి వనరుల జాడను గుర్తించేందుకు ఏడాది పాటు ఇది పనిచేయనున్నట్లు రోస్కాస్మోస్ వెల్లడించింది.
రష్యా 1976 తర్వాత చేపట్టిన తొలి లూనార్ ల్యాండర్ ప్రయోగం ఇదే కావడం విశేషం. ఇప్పటివరకు ఏ దేశ అంతరిక్ష నౌక కూడా చేరుకోని చంద్రుడి దక్షిణ ధ్రువంపై ‘చంద్రయాన్-3’ ద్వారా సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించాలని భావిస్తున్న ఇస్రోకు (ISRO).. ‘లునా -25’ ప్రయోగంతో రష్యా (Russia) పోటీ ఇస్తోంది. చంద్రయాన్-3 జాబిల్లి దక్షిణ ధ్రువంపై ఆగస్టు 23న ల్యాండ్ కానుండగా.. అంతకంటే ముందే రష్యా పంపిన లూనా-25 అక్కడే అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇది కేవలం ల్యాండర్ మిషన్ మాత్రమే. కేవలం 30 కేజీల పేలోడ్‌ను మోసుకెళ్తోంది. ఇందులో చంద్రుడిపై మట్టి ఆనవాళ్లను సేకరించేందుకు అవసరమయ్యే రోబోటిక్ చేతులు, డ్రిల్లింగ్ హార్డ్‌వేర్‌తో పాటు ఇతర శాస్త్రీయ పరికరాలు ఉన్నాయి.