తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని యువతి ఆత్మహత్య(Young woman commits suicide) చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లాలో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కరీంశెట్టి జన్ని, సత్యవతి దంపతుల కుమార్తె యువనాగదుర్గ (23)కు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్ధం అయ్యింది. కొద్ది రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. అయితే ఆదివారం నాగదుర్గ (Nagadurga)ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇష్టం లేని పెళ్లి కారణంగానే మనస్థాపంతో ఉరేసుకుందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి దర్యాప్తు చేపట్టారు.
ఇలాంటి ఘటననే ఇటీవల చౌటకూర్(Chautakur) మండల కేంద్రంలో జరిగింది. ఇంట్లో వాళ్లు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని చౌటకూర్‌కు చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చౌటకూర్ గ్రామానికి చెందిన కిష్టయ్యకు అదే గ్రామానికి చెందిన విజయను ఇచ్చి వివాహం చేశారు. ఈ దంపతులకు ఒక కుమారుడు, కూతురు రుక్మిణి జన్మించారు. అయితే విజయ భర్త కిష్టయ్య 9ఏళ్ల కిందట మరణించాడు. ఆ సమయంలో హత్నూర మండలం కొన్యాల గ్రామంలోని విజయ ఆడబిడ్డ కుమారుడు అనిల్‌కు రుక్మిణిని ఇచ్చి వివాహం జరిపించాలని చిన్న వయస్సులోనే నిర్ణయించారు.
రుక్మిణి పెరిగి పెద్దయ్యాక అనిల్‌ను పెళ్లి చేసుకోవాలంటూ పెద్దలు సూచించారు. అయితే తనకు అనిల్‌తో పెళ్లి ఇష్టం లేదని రుక్మిణి స్పష్టం చేసింది. ఈ విషయంపై గత మంగళవారం మరోసారి విజయ ఆడ బిడ్డతో పాటు రుక్మిణి, ఆమె చిన్నాన్న శ్రీశైలం మధ్య చర్చ జరిగింది. రుక్మిణి ఇంటికి వెళ్లి మేనబావ అనిల్ ను పెళ్లి చేసుకోవాలంటూ బలవంత పెట్టారు. దీంతో తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంటూ రుక్మిణి (Rukmini)ఇంట్లోకి వెళ్లి చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి విజయ ఫిర్యాదుతో పుల్కల్ ఎస్సై విజయ్ కుమార్ గౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.