ఎన్నో ప్రేమ సినిమాలు, ప్రేమ కథలు వింటుంటాం. ఆలా విని పూర్తిగా ఇన్స్పైర్ అయినపుడు ఇదంతా సినిమాల్లోనే కదా జరిగేది. నిజంగా ఇలా జరుగుతుందా.. ఇదంతా ఏదో టైం పాస్ కోసమే అని అనుకుంటాం. కానీ ఇది కథ కాదు నిజంగానే మేం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం అని ఎక్కడో ఒక చోట నిరూపితమౌతూనే ఉంటాయి. ఇంతకముందు సీమాహైదర్, సచిన్ మీనా ఇద్దరు ఇష్టపడి పెళ్లిచేసుకున్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో మరొక లవ్‌స్టోరీ వెలుగులోకి వచ్చింది. ప్రేమించిన యువకుడ్ని పెళ్లి చేసుకునేందుకు దక్షిణ కొరియా నుంచి భారత్ వచ్చింది కిమ్ బోహ్ ని అనే యువతి. అనంతరం ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సుఖ్జిత్ సింగ్‌ను పెళ్లాడింది. పంజాబీ సంప్రదాయాల ప్రకారం గురుద్వారాలో ఘనంగా వీరి పెళ్లి జరిగింది.
షాజహాన్‌పుర్ జిల్లా పువాయం పరిధిలోని ఉడ్నా గ్రామానికి చెందిన సుఖ్జిత్ సింగ్.. నాలుగేళ్ల క్రితం ఉద్యోగం కోసం దక్షిణ కొరియా వెళ్లాడు. అక్కడ ఓ కాఫీ షాప్‌లో పనికి కుదిరాడు. కిమ్ బోహ్ ని కూడా అక్కడే పనిచేసేది. మొదట్లో స్నేహితులుగా మెలిగిన వీరిద్దరు.. క్రమంగా ప్రేమికులుగా మారారు. దక్షిణ కొరియాలో కేవలం ఆరు నెలల పాటే పనిచేసిన సుఖ్జిత్.. తిరిగి భారత్‌కు వచ్చాడు. అయినా.. కిమ్ బోహ్ నితో తరచూ ఫోన్లో మాట్లాడుతుండేవాడు. సుఖ్జిత్ సింగ్ పెళ్లి చేసుకుందామని భావించిన కిమ్.. నెలన్నర క్రితం మూడు నెలల టూరిస్ట్ వీసాపై భారత్‌కు వచ్చింది. అనంతరం సుఖ్జిత్ ఇంటికి చేరి.. రెండు రోజుల క్రితం అతడ్ని పెళ్లి చేసుకుంది.
భారతీయ సంప్రదాయాలంటే ఎంతో ఇష్టమని చెబుతోంది కిమ్ బోహ్ ని. తన మూడు నెలల వీసా గడువు ముగిసిన తరువాత సుఖ్జిత్ సింగ్‌తో కలిసి తిరిగి దక్షిణ కొరియా వెళ్తానని ఆమె తెలిపింది. విదేశీ యువతిని కోడలిగా పొందటంపై సుఖ్జిత్ సింగ్ కుటుంబ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కుటుంబం అంతా ఆనందంతో సంతోష క్షణాలు గడుపుతున్నారు.