నేటి బాలలే.. రేపటి పౌరులు. పాఠశాలలో విద్యనభ్యసించి దేశ భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాల్సిన విద్యా కుసుమాలు.. చిన్నచిన్న కారణాలకు మనస్తాపం చెంది క్షణికావేశంలో ఆత్మహత్యలకు (Student Suicides Telangana) పాల్పడుతున్నారు. ఫోన్లు కొనివ్వడం లేదని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మందలించారని ఇలా వివిధ కారణాలతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అల్లారు ముద్దుగా సాకిన తల్లిదండ్రులకు తీరని గశోకాన్ని మిగులుస్తున్నారు. అలా తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సూర్యాపేట(Suryapet) జిల్లాలో చోటుచేసుకుంది. ఆత్మకూరు (Athmakur) మండల కేంద్రంలోని జ్యోతిభా ఫూలే గురుకుల పాఠశాలలో.. రాకేశ్ అనే విద్యార్థి ఉరి వేసుకుని అత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. నల్గొండ జిల్లా నిడమానూరు మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన ఆలకుంట్ల వెంకన్న- జయలక్ష్మీ దంపతుల కుమారుడు.. రాకేశ్ ఆత్మకూరు జ్యోతిభా ఫూలే గురుకులంలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. గత మంగళవారం రాత్రి పాఠశాల హాస్టల్లో ఓ విద్యార్థి.. అకస్మాత్తుగా విద్యుత్ సరఫరాను ఆపేశాడు. దీంతో ఆగ్రహించిన రాకేశ్.. విద్యుత్ నిలిపి వేయడాన్ని ప్రశ్నిస్తూ గట్టిగా కేకలు వేశాడు.
ఇతరులను డిస్టర్బ్ చేస్తున్నాడని కేర్‌టేకర్‌గా ఉన్న ఉపాధ్యాయుడు.. కేకలు వేసిన రాకేశ్‌ను దుర్భాషలాడాడు. తననెందుకు తిట్టారని.. సదరు ఉపాధ్యాయుడ్ని గట్టిగా ప్రశ్నించాడు. ఈ విషయం కాస్త ప్రిన్సిపాల్ వద్దకు చేరడంతో మరుసటి రోజు ఉదయం రాకేశ్‌ని.. ప్రధానోపాధ్యాయుడు పిలిపించి మందలించారు. విద్యుత్ నిలిపేసినట్లుగా భావించిన మరో విద్యార్థిని కూడా ప్రిన్సిపల్ వద్దకు పిలిపించారు. తాను ఎవరి పేరు చెప్పలేదని.. తనను తోటి విద్యార్థుల ముందు చాడీలు చెప్పేవాడిగా నిలబెట్టవద్దని రాకేశ్ విలపించాడు. ఈ విషయంలో తీవ్ర మానసిక ఆందోళనకు గురైన రాకేశ్.. తాను ఏ తప్పు చేయలేదని ఉపాధ్యాయుల కాళ్లపై పడి ప్రాధేయపడ్డాడు. రాకేశ్ పరిస్థితిని గమనించిన ఉపాధ్యాయులు అతడిని ఓదార్చి సర్దిచెప్పారు.
అయితే ఈ పరిణామాలను అవమానంగా భావించిన ఆ విద్యార్థి మాత్రం తీవ్రంగా మనస్తాపం చెందాడు. అదే కారణంతో బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని ఉపాధ్యాయులు, విద్యార్థులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి మృతి పట్ల తల్లిదండ్రులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న బంధువులు, విద్యార్థి సంఘం నాయకులు మృత దేహంతో పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. బాధిత తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థి మరణానికి గల కారణాలను చెప్పాలని.. అలాగే అతడి మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.