ఇరాక్‌లోని ఓ పెళ్లి వేడుకలో అంతులేని విషాదం(Tragedy) నెలకొంది. అప్పటి వరకూ సందడిగా ఉన్న పెళ్లింట ఒక్కసారిగా హాహాకారాలతో మారు మోగిపోయింది. ఫంక్షన్ హాలులో ఒక్కాసారిగా మంటలు చెలరేగడంతో దాదాపు వంద మందికిపైగా(100 people death) అగ్నికి ఆహుతయ్యారు. మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ విషాద ఘటన ఉత్తర ఇరాక్‌లో మంగళవారం (సెప్టెంబర్ 26) రాత్రి చోటుచేసుకుంది.
ఇరాక్‌లోని నినెవే ప్రావిన్స్‌లోని హమ్దానియా(Hamdania) జిల్లాలో మంగళవారం (సెప్టెంబర్ 26) రాత్రి జరిగిన ఓ క్రిస్టియన్ వివాహ వేడుకలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదంలో దాదాపు 100 మందికి పైగా మృతి చెందగా 150 మంది గాయపడినట్లు ఇరాక్ స్థానిక మీడియా(Iraqi local media) పేర్కొంది. గాయపడిన వారిని సమీపంలోని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన నినెవే ప్రావిన్స్ రాజధాని బాగ్దాద్‌కు వాయువ్యంగా దాదాపు 335 కిలోమీటర్లు (205 మైళ్ళు) దూరంలో ఉంది. అది క్రైస్తవులు ఎక్కువగా ఉండే ప్రాంతం.
నినెవే ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ హసన్ అల్-అల్లాక్(Deputy Governor Hassan Al-Allaq) మాట్లాడుతూ.. పెళ్లి వేడుకలో బాణా సంచాకాల్చిన తర్వాత ఫంక్షన్ హాల్‌లో మంటలు చెలరేగినట్లు మీడియాకు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఫంక్షన్ హాల్‌లోని నిర్మాణ సామగ్రి మంటలు వ్యాపించడానికి అనుకూలంగా ఉండటంతో, అగ్నిప్రమాదం సంభవించిన క్షణాల వ్యవధిలోనే వేగంగా దగ్ధమయినట్లు తెలుస్తోంది. పెళ్లి మండపంలో మంటలు చెలరేగుతున్న వీడియో ఫుటేజీలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
సమాచారం అందుకున్న ఇరాక్ సెమీ అటానమస్ కుర్దిస్తాన్ ప్రాంతంలోని ఫెడరల్ ఇరాకీ అధికారులు అంబులెన్స్‌లు, వైద్య సిబ్బందిని సంఘటన స్థలానికి తరలించారు. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇరాన్ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 10 గంటల 45 నిమిషాల ప్రాంతంలో ఫంక్షన్ హాల్‌లో మంటలు చెలరేగాయి. సంఘటన జరిగిన సమయంలో పెళ్లి మండపంలో వందలాది మంది ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి సైఫ్ అల్-బదర్ ప్రాణ నష్టాన్ని అంచనా వేశారు. ఈ దురదృష్టకర ప్రమాదంలో ప్రభావితమైన వారికి సహాయం అందించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇరాక్ ప్రధాన మంత్రి మహ్మద్ షియా అల్-సుదానీ అగ్నిప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు.