అమెరికాలోని హవాయి దీవిలో తీవ్ర విధ్వంసం జరిగింది. ఈ దీవిలో ఏర్పడిన భీకర కార్చిచ్చు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 100ఏళ్లలోనే అత్యంత తీవ్రమైన ప్రకృతి విపత్తు ధాటికి లహైనా రిసార్టు నగరం బూడిద దిబ్బగా మారింది. ఎక్కడ చూసినా ఇండ్లు, భవనాలు, కార్చిచ్చు దాటికి తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.ఈ దీవిలో వేగంగా వ్యాపించిన మంటల ధాటికి దాదాపు అన్ని ఇళ్లు మాడి మసి అయ్యాయి. సుమారు వంద మందికి పైనే ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే.. ఓ భవనానికి మాత్రం రవ్వంత నష్టం కూడా జరగలేదు. ఊరంతా కార్చిచ్చుకు బూడిదైతే.. ఆ భవనం మాత్రం చెక్కుచెదరలేదు. లహైనా నగరంలో ఫ్రంట్ స్ట్రీట్‌లో కుప్పకూలిన భవన శిథిలాల మధ్య చెక్కుచెదరకుండా ఉన్న ఓ రెడ్ రూఫ్ భవంతి ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే ఫొటోషాప్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, దీనిపై ఆ భవన యజమాని ట్రిప్ మిలికిన్ స్పందిస్తూ.. అది నిజమైన ఫొటోనే అని చెప్పారు. అదే సమయంలో కార్చిచ్చు నుంచి తమ భవనం సురక్షితంగా ఉండటానికి కారణాలను కూడా వివరించారు.
‘‘కార్చిచ్చు సంభవించినప్పుడు నేను, నా భార్య మసాచుసెట్స్‌కు విహారయాత్రకు వెళ్లాం. ప్రమాదం వార్త తెలియగానే మా ఇల్లు కూడా పూర్తిగా కాలిపోయి ఉంటుందని భావించాం. కానీ మరుసటి రోజు ఏరియల్ ఫుటేజ్‌లను చూస్తే మా ఇంటికి ఏం కాలేదని తెలిసి మేం కూడా ఆశ్చర్యపోయాం. దీనికి స్పష్టమైన కారణం తెలియనప్పటికీ.. పైకప్పు వల్లే భవనానికి ఏం కాలేదని భావిస్తున్నాం’’ అని మిలికన్ తెలిపారు. 100 ఏళ్ల పురాతనమైన ఈ భవంతిని మిలికన్ దంపతులు రెండేళ్ల క్రితమే కొనుగోలు చేశారట. ‘‘పాతకాలం ఇల్లే అయినా ఎలాంటి మరమ్మతుల అవసరం లేకపోయింది. దీంతో మేం దానికి కొన్ని హంగులు జోడించాలనుకున్నాం. అలా ఆస్ఫాల్ట్ రూఫ్‌ను తొలగించి దాని స్థానం భారీ బరువుండే మెటల్‌తో పైకప్పును ఏర్పాటు చేయించాం. ఇంటి చుట్టూ పచ్చికను తొలగించి బండతో ఫ్లోరింగ్ వేయిచాం. అందరి మాదిరిగానే మాది కూడా చెక్కతో నిర్మించిన ఇల్లే. అయితే, ప్రమాద సమయంలో మా చుట్టుపక్కల చాలా ఇళ్లు.. నిప్పు కణికలు పైకప్పుపై పడటంతో వేగంగా అంటుకుని కాలిపోయాయి. మా ఇంటిపై మెటల్ రూఫ్ ఉండటంతో నష్టం తప్పింది’’ అని మిలికన్ దంపతులు వివరించారు. లహైనాలో కార్చిచ్చు బీభత్సానికి ఇప్పటివరకు 114 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా కొంతమంది శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. వారి కోసం గాలింపు కొనసాగుతోంది.