ఎలక్ట్రిక్ వస్తువులకు చిన్నపిల్లలను దూరంగా ఉంచాలని అధికారులు పదే పదే హెచ్చరిస్తున్న ప్రజలు పట్టించుకోవట్లేదు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగా చిన్నారులు బాల్యంలోనే తమ తనువు చాలిస్తున్నారు. చివరకు ఎంతో ప్రేమతో అల్లారుముద్దుగా పెంచుకున్న తమ పిల్లలను వారి ప్రేమకు దూరం చేసుకుంటున్నారు. తమ బిడ్డలు లేరన్న వ్యధతో జీవితాంతం కాలం గడుపుతున్నారు.తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. విద్యుత్ అగాథంతో బాలుడుమృతి చెందిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని నాగ్‌పుర్ జిల్లా హింగ్నా పోలీస్‌స్టేషను పరిధిలో నాలుగేళ్ల బాలుడు టీవీ సెట్‌టాప్ బాక్సు పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. అప్పటిదాకా టీవీలో కార్టూన్లు చూస్తూ ఆనందంగా గడిపిన చిన్నారి విగతజీవిగా మారడం చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని చాటే ఈ ఘటన మంగళవారం జరగ్గా.. బుధవారం వెలుగులోకి వచ్చింది. తండ్రి ఇంట్లో పడుకొని ఉండగా.. టీవీ చూస్తున్న బాలుడు సెట్‌టాప్ బాక్సును లాగే ప్రయత్నం చేశాడు. విద్యుదాఘాతం సోకి మృత్యువాతపడ్డాడు. పుత్రుడి మృతితో ఆ కుటుంబం శోక సంద్రమైంది. అనంతరం పుత్రుడికి దహన సంస్కారాలు నిర్వహించారు.