బ్రిక్స్ కూటమిలోకి మరో ఆరు దేశాలు వచ్చి చేరనున్నాయి. అర్జెంటీనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లకు పూర్తి స్థాయి సభ్యత్వం ఇవ్వాలని కూటమి నిర్ణయించింది. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న మూడు రోజుల శిఖరాగ్ర భేటీలో ఆఖరు రోజైన గురువారం మీడియా సమావేశంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ఈ మేరకు ప్రకటించారు. 2024 జనవరి ఒకటో తేదీ నుంచి ఆరు దేశాల సభ్యత్వం అమల్లోకి వస్తుందని తెలిపారు.
బ్రిక్స్ బలం అయిదు నుంచి 11 దేశాలకు పెరగనుంది. ఈ నిర్ణయంపై ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా హర్షం వ్యక్తం చేశారు. బ్రిక్స్ అధ్యక్ష పీఠంపై ఉన్న దక్షిణాఫ్రికాలో కూటమి శిఖరాగ్ర సమ్మేళనం జరుగుతోంది. ‘సిద్ధాంతాలు, ప్రమాణాలు, విధానాల ప్రాతిపదికన విస్తరణ ప్రక్రియను ఏకాభిప్రాయంతో చేపట్టాం. మున్ముందు కూడా కూటమిని విస్తరిస్తాం’అని రమఫోసా చెప్పారు.
బ్రిక్స్ విస్తరణ, ఆధునీకరణ.. ప్రపంచంలోని అన్ని సంస్థలు మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలనే సందేశం ఇస్తుందని ప్రధాని మోదీ ఒక ప్రకటనలో తెలిపారు. ‘బ్రిక్స్ విస్తరణకు భారత్ మొదట్నుంచీ మద్దతుగా నిలిచింది. కొత్తగా సభ్య దేశాలను చేర్చుకోవడం ద్వారా బ్రిక్స్ మరింత బలోపేతమవుతుంది. ఉమ్మడి ప్రయత్నాలకు కొత్త ఊపునిస్తుంది. బహుళ ధ్రువ ప్రపంచ క్రమతపై విశ్వాసం పెంచుతుంది’అని ప్రధాని మోదీ అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తన వర్చువల్ ప్రసంగంలో బ్రిక్స్ తాజా విస్తరణపై హర్షం వ్యక్తం చేశారు. కూటమిలో సహకారానికి కొత్త అధ్యాయం మొదలైందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు.
బ్రిక్స్ భాగస్వామ్య దేశం నమూనా, కూటమిలో చేరాలనుకునే దేశాల జాబితాను ఏడాది జరిగే శిఖరాగ్ర సమ్మేళనం నాటికి సిద్ధం చేసే బాధ్యతను విదేశాంగ మంత్రులకు అప్పగించినట్లు రమఫోసా చెప్పారు. స్థానిక కరెన్సీలు, చెల్లింపు విధానాల్లో తలెత్తే సమస్యల పరిష్కారంపై నివేదిక రూపొందించాల్సిందిగా బ్రిక్స్ ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లకు సూచించేందుకు అంగీకారానికి వచి్చనట్లు ఆయన వివరించారు. 2006లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనాలు బ్రిక్‌గా ఏర్పాటయ్యాయి. దక్షిణాఫ్రికా చేరికతో 2010 నుంచి బ్రిక్స్‌గా రూపాంతరం చెందింది. బ్రిక్స్‌లో చేరేందుకు 40 వరకు దేశాలు ఆసక్తి చూపుతుండగా వీటిలో 23 దేశాలు సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ప్రస్తుత కూటమి ప్రపంచ జనాభాలో 41%, ప్రపంచ జీడీపీలో 24%, ప్రపంచ వాణిజ్యంలో 16% వరకు వాటా కలిగి ఉంది. పశి్చమదేశాల కూటమికి బ్రిక్స్‌ను ప్రధాన పోటీ దారుగా భావిస్తున్నారు.