అమెరికాలోని హవాయి దీవిలో ఏర్పడిన కార్చిచ్చు తీరని నష్టాన్ని మిగిల్చింది. ఎటు చూసినా అగ్నికీలలే.. ఎక్కడ చూసిన కాలిన బూడిదే కనిపిస్తోంది. లహైనా రిసార్టు నగరంలో ఈ ప్రకృతి విపత్తు సృష్టించిన బీభత్సం కారణంగా మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 53 మంది మృతి చెందినట్లు హవాయి గవర్నర్ జోష్ గ్రీన్ వెల్లడించారు. ‘‘అనుమానమే లేదు. లహైనాపై బాంబు పడినట్లుగా ఉంది. ఎటు చూసినా అంతా భస్మీపటలమైన నిర్మాణాలే కన్పిస్తున్నాయి’’ అంటూ గ్రీన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్చిచ్చు కారణంగా 1000కి పైగా నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. అనేక కార్లు, వాహనాలు కాలిబూడిదయ్యాయి. మంగళవారం రాత్రి ఈ కార్చిచ్చు మొదలైంది. హరికేన్ ప్రభావంతో బలమైన గాలులు వీయడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. చూస్తుండగానే నివాసాలను చుట్టుముట్టాయి. వీధుల్లో దట్టమైన పొగ అలముకుంది. ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. కొందర పొగ, మంటల బారి నుంచి తప్పించుకునేందుకు పసిఫిక్ మహాసముద్రంలోకి దూకారు.
రంగంలోకి దిగిన అధికారులు, సహాయక సిబ్బంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంకా కొందరు శిథిలాల కింద చిక్కుకోగా వారి కోసం గాలిస్తున్నారు. ఇప్పటివరకు 53 మృతదేహాలను గుర్తించగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
కార్చిచ్చును ఆర్పేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయినప్పటికీ ఇంకా కొన్ని చోట్ల మంటలు వేగంగా వ్యాపిస్తున్నట్లు హవాయి ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ వెల్లడించింది. ఇంకా ఆస్తి నష్టాన్ని అంచనా వేయలేదు. కానీ, నగరంలో చాలా వరకు నిర్మాణాలు కాలి బూడిదయ్యాయి. హవాయిలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో లహైనా కూడా ఒకటి. దీంతో హోటళ్లు, రిసార్టుల సంఖ్య కూడా ఎక్కువే. ఇప్పుడవన్నీ ధ్వంసమయ్యాయని స్థానికులు చెబుతున్నారు.