అవినీతి నిరోధక శాఖ(Anti Corruption Bureau) సోదాల్లో నల్గొండ జిల్లా మర్రిగూడ తహసీల్దార్ మంచిరెడ్డి మహేందర్‌రెడ్డి(MRO Mahindar Reddy) అక్రమార్జన బయటపడింది. ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టాడనే ఆరోపణలు రావడంతో ఏసీబీ(ACB) అధికారులు ఏకకాలంలో 15 చోట్ల సోదాలు నిర్వహించారు. మహేందర్ రెడ్డి ఇంట్లో భారీగా నగదు, బంగారం, ఇతర ఆస్తులను గుర్తించారు. ఈ తనిఖీల్లో ఇంట్లోని ఓ ట్రంకు పెట్టెలో భారీగా దాచిన నోట్లకట్టలు బయటపడ్డాయి. ఆ పెట్టెను కట్టర్ సాయంతో తెరిచి.. నగదును లెక్కించగా.. రూ.2.7 కోట్లు ఉన్నట్లు తేలింది. ఇతర చర, స్థిరాస్తులు కలిపి.. మొత్తం వాటి విలువ రూ.4.56 కోట్ల వరకు ఉంటుందని అధికారులు గుర్తించారు. ఈ సోదాల్లో కిలోకు పైగా బంగారం (GOLD)కూడా దొరికినట్టు సమాచారం. మహేందర్ రెడ్డి స్థిరాస్తి వ్యవహారాలు సైతం నడిపిస్తున్నాడని ఏసీబీ భావిస్తోంది. మరోవైపు అతని కుటుంబ సభ్యులు, సమీప బంధువుల ఇళ్లతో పాటు.. మర్రిగూడ ఎమ్మార్వో కార్యాలయం (MRO Office) లోనూ అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేశారు.
నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం తహసీల్దార్‌గా పనిచేస్తున్న మంచిరెడ్డి మహేందర్‌రెడ్డి సొంతూరు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వెలిమినేడు గ్రామం. మహేందర్ రెడ్డి తండ్రి అంజన్‌రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందడంతో మహేందర్‌రెడ్డికి కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం G(Govt JOb)వచ్చింది. తొలి పోస్టింగ్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా విధుల్లో చేరాడు. తర్వాత రెవెన్యూ ఇన్‌స్పెక్టర్,( Revinue Inspector) డిప్యూటీ తహసీల్దార్ ( Deputy MRO) గా పని చేసి తహసీల్దార్‌గా పదోన్నతి పొందాడు. కందుకూరు తహసీల్దార్‌గా విధులు నిర్వర్తించిన మహేందర్‌రెడ్డి.. రెండు నెలల కిందట నల్గొండ జిల్లా మర్రిగూడ తహసీల్దార్‌గా బదిలీ అయ్యాడు. అతను ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని అవినీతి నిరోధక శాఖకు సమాచారం అందింది. దీంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు.. హైదరాబాద్‌లో హస్తినాపురం, శిరిడీ సాయినగర్‌లలోని.. మహేందర్‌రెడ్డి నివాసాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సోదాలు ముగిశాక మహేందర్‌రెడ్డికి వైద్య పరీక్షలు చేయించిన అనిశా అధికారులు.. ఏసీబీ (Anti Corruption Bureau) ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.