సుందర హవాయి దీవుల్లో కార్చిచ్చు ప్రాణ నష్టం.. ఊహించని రీతిలో పెను నష్టం మిగిల్చింది. నలువైపులా నుంచి అగ్ని కీలలు ఎగసి పడగా.. అదే సమయంలో పెనుగాలులు తోడవ్వడంతో పెను విషాదం మిగింది. 36 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించగా.. మృతుల సంఖ్య మరింతగా పెరిగేలా కనిపిస్తోంది. మౌయి ద్వీపంలోని రిసార్ట్ నగరం లహైనా బుగ్గిపాలైన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. అడవుల్లో కార్చిచ్చు రాజుకోగా.. హరికేన్ గాలులతో ఆ మంటలు శరవేగంగా వ్యాపించాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు తలోదిక్కు పరుగులు తీశారు. మరోవైపు మంటలు ఉవ్వెత్తున్న ఎగసిపడుతూ.. గాలుల కారణంగా మరింత త్వరగా వ్యాపించుకుంటూ పోయాయి. దీంతో.. భారీ నష్టం సంభవించింది. సహాయక చర్యల కోసం రంగంలోకి దిగాయి బృందాలు.
ఇప్పటివరకు చూడని ఘోరమైన విపత్తును మేము ఎదుర్కొన్నాము. లహైనా మొత్తం కాలిపోయింది. ఇది ఒక అపోకలిప్స్(ఘోర విపత్తు) లాంటిది అని ప్రాణాలు రక్షించుకున్న లహైనా వాసులు చెబుతున్నారు. చాలామంది మంటలు, పొగ నుంచి రక్షించుకునేందుకు పసిఫిక్ మహాసముద్రంలోకి దూకేశారు. ఒక బాంబు పడితే.. ఒక యుద్దం జరిగితే ఎలా ఉంటుందో.. అలా మారిపోయింది ఆ నగరం పరిస్థితి. హవాయ్ దీవుల్లోనే మౌయి అతిపెద్ద ద్వీపం. చారిత్రకంగానూ దీనికి ఓ గుర్తింపు ఉంది. అందులో ప్రధాన పర్యాటక ప్రాంతం(నగరం) లహైనానే. మంగళవారం రాత్రి అడవుల్లో ప్రారంభమైన మంటలు.. వేల ఎకరాలను నాశనం చేశాయి. దీనికి తోడు తుపాను గాలుల ప్రభావంతో అగ్నికీలలు అన్నివైపులా శరవేగంగా వ్యాపించాయి. పశ్చిమ భాగం ద్వీపం దాదాపు తుడిచిపెట్టుకుపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.