కోచింగ్ క్లాసులకు వెళ్లిన స్టూడెంట్ ఇంటికి తిరిగి రాలేదు.. ఉదయం ఎప్పట్లాగే పనికి వెళ్లిన వ్యక్తి సాయంత్రం ఇంటికి చేరుకోలేదు.. విధుల్లో భాగంగా రోడ్డెక్కిన ఓ జర్నలిస్టు ఏమైపోయాడో తెలియదు.. ఇలా ఒకరిద్దరు కాదు, మూడు నెలల్లో 30 మంది కనిపించకుండా పోయారు. అల్లర్లతో అట్టుడికిన మణిపూర్ లో జరిగిన ఘోరాలివి. మణిపుర్ హింసాకాండ అనంతరం తప్పిపోయిన వారి కుటుంబాల ఫిర్యాదుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. మణిపుర్ రాష్ట్రంలో 6వేల జీరో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయంటే అల్లర్లలో అదృశ్యమైన వారి సంఖ్య పెరగవచ్చని పోలీసులు అంటున్నారు. అల్లర్ల అనంతరం మణిపుర్‌కు చెందిన సమరేంద్ర సింగ్ భార్య కవిత కనిపించడం లేదు. మూడు నెలలుగా కొనసాగుతున్న హింసాత్మక ఆందోళనలలో చోటుచేసుకున్న ఘోరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో ఎంతోమంది కనిపించకుండా పోయారని, వారంతా ఏమయ్యారో తెలియదని సమాచారం. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకుండా పోయిందని బాధితులు చెబుతున్నారు.
అల్లర్లకు సంబంధించి ఇప్పటి వరకు సుమారు 6 వేల జీరో ఎఫ్ఐఆర్ లు నమోదైనట్లు అధికార వర్గాల సమాచారం. కుటుంబానికి ఆధారమైన కొడుకు కనిపించకుండా పోవడంతో దిక్కులేనివారమయ్యామంటూ ఓ జర్నలిస్టు తల్లి వాపోయారు. రెండు నెలల క్రితం స్నేహితుడితో కలిసి వెళ్లిన జర్నలిస్ట్ ఆటమ్ సమరేంద్ర సింగ్ ఇంటికి తిరిగి రాలేదు. ఇప్పటికీ అతని ఆచూకీ గుర్తించలేకపోయామని పోలీసులు చెప్పారు.
హింసాకాండ ప్రారంభం అనంతరం జర్నలిస్ట్, పరిశోధకుడు, సామాజిక కార్యకర్త అయిన సింగ్ అదృశ్యమయ్యారు. అతనితోపాటు ఉన్న 48 ఏళ్ల యుమ్ ఖైబామ్ కిరణ్ కుమార్ సింగ్ అల్లర్ల అనంతరం తిరిగి ఇంటికి రాలేదు. వీరిద్దరూ అల్లర్ల తర్వాత కాంగ్ పోక్పి జిల్లా సరిహద్దుల్లో ఉన్న మణిపూర్ ఒలింపిక్ పార్కు వద్ద ఉన్న సాహెబంగ్ ప్రాంతానికి వెళ్లారు. అప్పటి నుంచి వారి సెల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ లో ఉన్నాయి. మిస్సింగ్ ఫిర్యాదుతో సోదాలు నిర్వహిస్తున్నామని, అయితే ఇంతవరకు అదృశ్యమైన వారి జాడ తెలియలేదని పోలీసు వర్గాలు తెలిపాయి.
తాను ఢిల్లీలో చదవాలని తన తండ్రి కోరుకునే వాడని, ఇప్పుడు ఆయన కనిపించకుండా పోవడంతో తానెలా చదువుకోవాలని సింగ్ కుమారుడు ఆటమ్ దోహెన్బా ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్ ప్రభుత్వం డీఎన్ఏ నమూనాలు సేకరించకుండానే మృతదేహాలకు అంత్యక్రియలు చేసిందని, తప్పిపోయిన వ్యక్తుల ఆచూకీ కనుగొనలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.
నీట్ కోచింగ్ క్లాసులకు వెళ్లిన పదిహేడేళ్ల కూతురు ఇంటికి తిరిగిరాలేదని ఆమె తల్లి వాపోయింది. జులై 6న బాయ్ ఫ్రెండ్ తో కలిసి వెళ్లిందని, సాయంత్రం అవుతున్నా ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేశానని చెప్పింది. ఎక్కడున్నావని అడిగితే నంబోల్ లో ఉన్నట్లు భయపడుతూ చెప్పిందని, అక్కడేం చేస్తున్నావని అడుగుతుండగానే ఫోన్ కట్ అయిందని వివరించింది. దీంతో భయాందోళనలకు గురై పోలీసులను ఆశ్రయించామని ఆ తల్లి తెలిపారు.
తన కూతురు బాయ్ ఫ్రెండ్ తో కలిసి బైక్ పై నంబోల్ వెళ్లినట్లు ఓ సీసీటీవీ ఫుటేజీలో రికార్డైందని పోలీసులు చెప్పారన్నారు. ఆపై తన కూతురు ఎక్కడుందో తెలుసుకోవడం సాధ్యం కావడంలేదని, ప్రాణాలతో ఉందో లేదో కూడా తెలియదని వాపోయారు. బాధితురాలితో పాటు వెళ్లిన యువకుడు కూడా కనిపించకుండా పోయాడని, అతడి ఫోన్ లో వేరే సిమ్ వేసి వాడుతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.
ఇంఫాల్ వ్యాలీ మెయిన్ రోడ్ కు పది కిలోమీటర్ల దూరంలోని టిడ్డిమ్ రోడ్ లో ఆ ఫోన్ లొకేషన్ ను పోలీసులు గుర్తించారు.. అయితే, అక్కడికి వెళ్లేందుకు పోలీసులు భయపడుతున్నారని బాధిత యువతి తల్లి చెప్పారు. మరోవైపు, అల్లర్లలో చనిపోయిన వారి మృతదేహాలు ఇంఫాల్ లోని వివిధ ఆసుపత్రుల మార్చురీల్లో ఉన్నాయని, వాటిని సామూహిక ఖననం చేసేందుకు అనుమతివ్వాలని అధికారులను కోరినట్లు ట్రైబల్ లీడర్స్ ఫోరమ్ నేతలు చెబుతున్నారు.