ఉద్యోగ పోటీలో నెగ్గాలంటే మిమ్మల్ని స్పష్టంగా పరిచయం చేసే రెజ్యూమె ప్రధానం. ఫ్రెషర్స్ నుంచి అపార అనుభవం ఉన్న నిపుణుల వరకు, ఇతర ప్రత్యేక అర్హతలను అనుసరించి రెజ్యూమె ఫార్మాట్ మారిపోతుంటుంది. దీనిలో తెలియజేసే వివరాలే ఉద్యోగాన్ని తెచ్చిపెడతాయి. అనుభవం, చక్కని నైపుణ్యాలు ఉన్నప్పటికీ వాటిని సరిగా పొందుపరచకపోతే అరుదైన అవకాశాన్ని కోల్పోయే ప్రమాదముంది! ఇంత ప్రాముఖ్యమున్న రెజ్యూమె ఫార్మాట్ల గురించి తెలుసుకుందాం!
క్రోనలాజికల్ రెజ్యూమె
ఒక రంగంలో ఐదేళ్లకు మించిన అనుభవం మీకుంటే క్రోనలాజికల్ రెజ్యూమె ఫార్మాట్ అవసరం. ఇందులో పనిచేసిన సంస్థల వివరాలను నిర్వర్తించిన విధులు, చూపిన ప్రతిభాపాటవాలు, సామర్థ్యాలను విశదీకరిస్తుంది. ఉద్యోగ వివరాల సమాచారం ఈ రెజ్యూమెలో కీలకం. డేటాను సేకరించడం, ఎడిట్ చేసి, రిపోర్ట్ చేయడం, కంప్యూటింగ్‌లాంటి ప్రాక్టికల్ నైపుణ్యాలతోపాటు, నిర్దేశిత సమయంలో పూర్తిచేయగల శ్రద్ధ, సమయపాలన లాంటి సాఫ్ట్ స్కిల్స్‌ను నైపుణ్యాల జాబితాలో చేరుస్తుంది.
ఫంక్షనల్ రెజ్యూమె
ఫ్రెషర్స్ లేదా మొదటిసారి ఉద్యోగానికి ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు ఈ ఫార్మాటే సోపానం. సంస్థ ఆశించే స్థాయిలో మీరు నిర్దేశించుకున్న భవిష్యత్తు ఉద్యోగ లక్ష్యాలను సంక్షిప్తీకరించాలి. వృత్తిపరమైన నైపుణ్యాలు, క్లిష్టసమయాల్లో చాకచక్యంగా వ్యవహరించగల నైపుణ్యాలపైనే ఎక్కువ దృష్టి పెడుతుంది ఈ రెజ్యూమె. ఇంతకుముందు పనిచేసిన అనుభవాలను సంస్థలవారీగా పొందుపరచాలి.
హైబ్రీడ్ రెజ్యూమె
ఇది క్రోనలాజికల్, ఫంక్షనల్ రెజ్యూమె ఫార్మాట్‌ల కలయికగా ఉంటుంది. ఏదైనా రంగంలో అనుభవం ఉన్నప్పటికీ, కొత్తగా ఇతర రంగంలో చేరాలనుకునేవారికి ఇది ఉపయోగపడుతుంది. నూతన రంగంలో రాణించాలనుకుంటే గతంలో పనిచేసిన మీ అనుభవాలనూ, మీ ప్రత్యేక నైపుణ్యాలనూ ప్రస్తావిస్తూ చిన్న పేరాలా రాయాలి. ఈ ఫార్మాట్‌లో రెండు రకాల నైపుణ్యాలు పొందుపరచవచ్చు. ఇదివరకు మీరు పని చేసిన అనుభవాలను ఎలా వినియోగించుకున్నారనేది ‘సమ్మరీ ఆఫ్ స్కిల్స్’, మీలోని ప్రత్యేక నైపుణ్యాలను పాయింట్లరూపంలో తెలియజేసేది ‘కీ స్కిల్స్’. నిర్దేశిత లక్ష్యాలను ఛేదించిన మీ గత ఉద్యోగానుభవాల్ని ఈ ఫార్మాట్ క్లుప్తంగా తెలియజేస్తుంది.