2024 ఎన్నికల కోసం జగన్ కెప్టెన్ ఇన్నింగ్స్
క్రికెట్ జట్టులో 11మంది ఉంటారు. వ్యక్తిగతంగా ఎవరి ఆట వారిదే అయినా.. జట్టును నడిపించేది మాత్రం కెప్టెనే. ప్రత్యర్థి జట్టును దెబ్బకొట్టేందుకు, జట్టును విజయతీరాలకు చేర్చడానికి వ్యూహాలు, ప్రతి వ్యూహాలు అమలు చేస్తుంటాడు. అవతలి జట్టు ఎత్తులను చిత్తు చేస్తూ, తోటి సభ్యులకు దిశానిర్దేశం చేస్తు ముందుకు సాగుతుంటాడు. 2024 ఎన్నికల కోసం అలాంటి కెప్టెన్ ఇన్నింగ్సే ఆడుతున్నారు సీఎం జగన్. వై నాట్ 175 అనే టార్గెట్ పెట్టుకుని.. అన్ని తానై వ్యవహరిస్తూ పార్టీని ముందుకు నడుపుతున్నాడు. పార్టీ పరంగా ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకుండా.. ప్రత్యర్థులకు చిక్కకుండా జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు జగన్. ఓ వైపు అభ్యర్థుల ఎంపిక, మరోవైపు ప్రజలకు సంక్షేమ పథకాల చేరివేతతో 2024ఎన్నికల కురుక్షేత్రానికి రెడీ అవుతున్నారు. టీడీపీ- జనసేన కూటమితో ప్రత్యర్థులు గట్టి పోటీ ఇస్తుండటంతో.. ఎన్నికలను పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు జగన్.
ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియను ప్రారంభించారు సీఎం జగన్. ఇది జనవరి 10నాటికి పూర్తిచేయనున్నట్టు పార్టీ కీలక నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో సమాంతరంగా పార్లమెంటు నియోజకవర్గాలకు పోటీ చేసే అభ్యర్థుల ఎంపికను కూడా ఆయన పరిశీలిస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల పని తీరును సర్వే ఫలితాల ద్వారా
బెరిజు వేసుకుంటూ ఎవరికి టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయో అనే అంచనాలతో మార్పులు చేర్పులు చేస్తున్నారు. గతంలో పనినీరు మార్చుకోవాలని ఎంత చెప్పినా వినని ఎమ్మెల్యేలపై వేటు వేస్తూ వారి స్థానంలో కొత్త ఇంఛార్జులను నియమిస్తున్నారు జగన్. అభ్యర్థుల ప్రకటన తర్వాత ప్రచార రణరంగంలోకి దిగనున్నారు జగన్.
పోటీ చేసే అభ్యర్థుల మార్పులు, చేర్పులతో అక్కడక్కడ కొంత అసమ్మతి గళం వినిపిస్తున్నా వాటిని చక్కదిద్దుకుంటూ ముందుకెళ్తున్నారు జగన్. ఎందుకు పార్టీ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో వారికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సంక్లిష్టమైన స్థానాలపై కాస్త వేచి చూసే ధోరణితో ఉన్నారు. అలాగే టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులను ఎంపిక చేసిన తర్వాత మార్పులు, చేర్పులు ఉంటే వాటిని తర్వాత నెల రోజుల్లో చేయనున్నారు. మొత్తానికి జనవరి 20నాటికి అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయనున్నారు. ఇక ఈలోగానే ఇవ్వాల్సిన పథకాలు, చేయాల్సిన పనులను కూడా పూర్తి చేయాలని జగన్ నిర్ణయించు కున్నట్టు పార్టీ కీలక నాయకులు చెప్తున్నారు. ఫిబ్రవరి చివరి వారంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కోసం అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నారు.
అభ్యర్థుల ఎంపిక పూర్తి అయ్యాక జిల్లాల వారిగా పర్యటనలు, సభలు ప్లాన్ చేస్తున్నారు జగన్. రాష్ట్రవాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ప్రత్యర్థులపై కౌంటర్ ఎటాక్ చేస్తూ ప్రసంగాలతో దంచి కొట్టనున్నారు. గత ఎన్నికల్లో జగన్‌కు అండగా తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల ఇద్దరూ ప్రచారం చేశారు. ఈ దఫా వారు దూరమైన నేపథ్యంలో అంతా జగన్‌పైనే భారం పడనుంది. దీంతో ఎన్నికల ప్రచారానికి కనీసం 50 రోజుల పాటు సుడిగాలి పర్యటనలు చేయడం ద్వారా.. ప్రతిపక్షాల ప్రచారానికి దీటుగా ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని టచ్ చేసేలా ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు.