రెండు వేల రూపాయల నోట్ల మార్పిడికి (2000 Note exchange) ఆర్‌బీఐ (RBI) ఇచ్చిన గడువు దగ్గర పడింది. సెప్టెంబర్ 30తో గడువు తీరబోతోంది. ఒకవేళ ఇప్పటికీ మీ దగ్గర రూ.2 వేల నోట్లు ఉంటే.. మార్చుకోవడానికి ఇంకా మూడు రోజులే గడువు ఉంది. అయితే, డెడ్‌లైన్ తర్వాత రూ.2 వేల నోట్ల పరిస్థితి ఏంటి? ఆర్‌బీఐ(RBI) ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందన్నది? ఆసక్తిగా మారింది. దీనిపై ఇప్పటి వరకు ఆర్‌బీఐ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. పెద్ద నోట్ల రద్దు(Demonetization) అనంతరం 2016లో రూ.2 వేలు నోట్లను ఆర్‌బీఐ అందుబాటులోకి తెచ్చింది. ‘క్లీన్ నోట్ పాలసీ’లో భాగంగా ఈ ఏడాది మే నెలలో ఉప సంహరించుకుంది. నోట్లను రద్దు చేయలేదు. అంటే ఇప్పటికీ లీగల్ టెండర్‌గానే (నోట్లకు చట్టబద్ధత) రూ.2వేల నోటు కొనసాగుతోంది.
అయితే, ఇప్పటికే పలు దుకాణాలు, పెట్రోల్ బంకులు రూ.2 వేల నోట్లను తీసుకోవడానికి నిరాకరిస్తున్నాయి. వాస్తవానికి నోట్ల మార్పిడికి ఆర్‌బీఐ దాదాపు 4 నెలల గడువు ఇచ్చింది. సెప్టెంబర్ 1 నాటికే దాదాపు 93 శాతం నోట్లు వెనక్కి వచ్చినట్లు ఆర్‌బీఐ(RBI) గణాంకాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30 తర్వాత కూడా రూ.2 వేల నోట్ల మార్పిడికి బ్యాంకుల్లో మరో అవకాశం ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. అయితే, నిర్దిష్ట గడువులోగా ఉపసంహరణ లక్ష్యం నెరవేరకపోతే లీగల్ టెండర్‌గా కొనసాగిస్తామని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్(Governor Shaktikanta Das) ఇప్పటికే ఓ సందర్భంలో చెప్పారు.
అయితే, నిర్దేశిత గడువులోగా వేర్వేరు కారణాలతో రూ.2వేల నోట్లను మార్చుకోని వారికి మాత్రం ఆర్‌బీఐ మరో ఛాన్స్ ఇచ్చే అవకాశమూ లేకపోలేదు. నగదు మార్పిడికి అంగీకరించనప్పటికీ.. డిపాజిట్ చేసుకోవడానికి మాత్రం మరో ఛాన్స్ ఇవ్వొచ్చని తెలుస్తోంది. అదీ కేవైసీ చేసిన బ్యాంక్ అకౌంట్లలో మాత్రమే డిపాజిట్ చేసేలా నిబంధన విధించవచ్చు.లేదంటే ఆర్‌బీఐ(RBI) ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే నోట్ల మార్పిడికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఆర్‌బీఐకి దేశవ్యాప్తంగా 19 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. కేవలం అక్కడ మాత్రమే నోట్ల మార్పిడికి అవకాశం కల్పించొచ్చు. ఇందుకోసం చిరునామా, ధ్రువీకరణ పత్రం వంటి వివరాలతో పాటు ఆలస్యానికి గల సహేతుక కారణాలను తెలియజేయాల్సి రావొచ్చు. 2005 కంటే ముందు నాటి నోట్లను ఉపసంహరించుకున్నప్పుడూ ఆర్‌బీఐ ఇలానే చేసింది.