వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షలో అర్హత సాధించలేదని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుమారుడి మరణంను తట్టుకోలేని తండ్రి తీవ్ర మనస్తాపానికి గురై.. రెండు రోజుల తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి…
చెన్నైలోని క్రోమ్‌పేటకు చెందిన 19 ఏళ్ల జగదీశ్వరన్ 2022లో 12వ తరగతి (ఇంటర్) పూర్తి చేశాడు. అనంతరం నీట్‌కు శిక్షణ తీసుకున్నాడు. రెండు ప్రయత్నాల్లో విఫలమయిన జగదీశ్వరన్.. తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శనివారం ఇంట్లోని తన గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది చూసిన కుటుంబసభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు.
జగదీశ్వరన్ గదిలో పోలీసులకు ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదు. అయితే జగదీశ్వరన్ తండ్రి సెల్వశేఖర్ మాత్రం తన కుమారుడి మరణానికి నీట్ నిర్వహణ కారణమని ఆరోపించారు. గుండె నొప్పికి తోడు కుమారుడి మృతిని తట్టుకోలేక సెల్వశేఖర్ రెండు రోజుల తర్వాత.. సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడులో నీట్‌ను తొలగించినందుకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సెల్వశేఖర్ చనిపోయే ముందు చెప్పారు.
ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఇలాంటి తీవ్ర నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కోరారు. కొన్ని నెలల్లో రాజకీయంగా మార్పులు వస్తే నీట్ అడ్డంకులు తొలగిపోతాయని స్టాలిన్ అన్నారు. ‘నేను సంతకం చేయను’ అనేవారు అదృశ్యమవుతారని గవర్నర్‌ను ఉద్దేశించి సీఎం విమర్శలు చేశారు.