భారత్ లో గత పన్నెండేండ్ల కాలంలో 16,63,440 మంది ప్రజలు భారత పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ పేర్కొన్నారు. గురువారం రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధాన మిచ్చిన ఆయన.. 2014-2022 మధ్య 12,88,293 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ సంఖ్య 2022లో అత్యధికంగా 2,25,620గా ఉందని తెలిపారు. ‘2014 నుంచి 2022 మధ్యకాలంలో 2,46,580 మంది భారతీయులు పాస్‌పోర్టులను సరెండర్ చేశారు. అయితే ఇందులో ఆంధ్ర ప్రదేశ్ కు చెందినవారు 9,235, తెలంగాణ వారు 7,256 మంది ఉన్నారు. అత్యధికంగా దిల్లీ నుంచి 60,414, పంజాబ్ నుంచి 28,117, గుజరాత్ నుంచి 22,300, గోవా నుంచి 18,610 మంది, మహారాష్ట్ర నుంచి 17,171, తమిళనాడు నుంచి 14,046 సరెండర్ చేశార’ని మంత్రి పేర్కొన్నారు.
ఈ మేరకు 2011 నుంచి 2022 వరకు గల వివరాలను కేంద్రం వెల్లడించింది. ఒక నిర్దిష్ట ప్రశ్నకు కేంద్ర మంత్రి జయశంకర్ స్పందిస్తూ గత మూడేళ్లలో ఐదుగురు భారతీయులు యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పౌరసత్వాన్ని పొందారని వెల్లడించారు. అయితే భారత పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు.. మొత్తంగా 135 దేశాల్లో పౌరసత్వాన్ని పొందారు. ఆ వివరాలను కూడా కేంద్ర మంత్రి జయశంకర్ పార్లమెంటుకు అందించారు.