హైదరాబాద్ లోని రాయదుర్గం మెట్రో స్టేషన్ సమీపంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ సంస్థకు 15 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ భూమినిఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ సంస్థ రాఫర్టీ డెవలప్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విక్రయించింది. ఈ మేరకు మెట్రోరైల్ లీగల్‌హెడ్, కంపెనీ కార్యదర్శి చంద్రచూడ్ డి.పాలివాల్ బుధవారం బీఎస్‌ఈ(స్టాక్ ఎక్ఛ్సేంజీ)కి అధికారికంగా తెలిపారు. ఆగస్టు 16న జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని బీఎస్‌ఈకి ఇచ్చిన లేఖలో తెలిపారు. ఈ విక్రయాన్ని ‘స్లంప్ సేల్’గా ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రతినిధులు అభివర్ణించారు. ఈ భూమి విలువ రూ.1,500 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఎల్‌అండ్‌టీతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు రాయదుర్గం మెట్రోస్టేషన్ సమీపంలో 15 ఎకరాలను భవిష్యత్ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.
ఈ భూమిలో 9 ఎకరాల్లో రూ.200కోట్లు వెచ్చించి ఎల్‌అండ్‌టీ అధికారులు ఒక భవనాన్ని నిర్మించారు. మెట్రో రైల్ నిర్వహణ, బ్రేక్ ఈవెన్ వంటి కారణాల నేపథ్యంలో ఆదాయ వనరులను సమకూర్చుకునేందుకు 15 ఎకరాల భూమి, భవనాన్ని విక్రయించేందుకు గతేడాదే ఎల్‌అండ్‌టీ నిర్ణయం తీసుకుందని సమాచారం. ఇందుకోసం రహేజా, బ్రూక్‌ఫీల్డ్ సంస్థలతో ఎల్‌అండ్‌టీ అధికారులు చర్చించారు. చర్చల ఫలితంగానే బుధవారం రూ.1,500కోట్ల విలువైన భూమి, భవనాన్ని రాఫర్టీ సంస్థకు విక్రయించారు. రాఫర్టీ సంస్థలో రహేజా, బ్రూక్‌ఫీల్డ్ కంపెనీలు భాగస్వాములుగా ఉన్నాయి. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఎల్‌అండ్‌టీ సంస్థ 33 ఏళ్ల వరకూ స్థలాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు తప్ప విక్రయించకూడదు. మరి 33 ఏళ్ల తర్వాత ఈ భూమి ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుందా? రాఫర్టీ సంస్థకు చెందుతుందా? అన్న అంశంపై స్పష్టత లేదు.
ఇటీవల హైదరాబాద్ శివారులో హెచ్‌ఏండీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రభుత్వ భూమల ఈ-వేలానికి అనుహ్య స్పందన వచ్చిన విషయం తెలిసిందే. కోకాపేట, మోకిలతో పాటు బుద్వేల్‌లో ప్రభుత్వం డెవలప్ చేసిన లేఅవుట్లలో ప్లాట్లు దక్కించుకునేందుకు కోనుగోలు దారులు పోటీ పడ్డారు. అత్యధిక ధర పెట్టి ప్లాట్లు సొంతం చేసుకున్నారు. ఇలా ఉహించిన ధర పెట్టి ఈ-వేలంలో భూములు దక్కించుకున్నవారు తీరా డబ్బులు చెల్లించే సమయానికి చేతులెత్తేస్తున్నారు. ఇటీవల వేలం వేసిన కొన్ని లేఅవుట్లలో అలాంటి పరిస్థితే ఎదురైంది.
నోటిఫికేషన్ తర్వాత రిజిస్ట్రేషన్, అనంతరం మినిమం డిపాజిట్ మొత్తం చెల్లించిన వారికే ఈ-వేలంలో పాల్గొనే ఛాన్స్ ఉంటుంది. ప్లాట్లు దక్కించున్న కొనుగోలుదారులు అమ్మకం విలువలో 33 శాతం (డిపాజిట్ కాకుండా) ఆఫర్ లెటర్ జారీ అయిన 7 రోజుల్లో చెల్లించాలి. మిగతా 67 శాతం డబ్బు 30 రోజుల్లో హెచ్‌ఎండీఏకు పే చెయ్యాలి. పెద్ద ప్లాట్లు దక్కించుకున్న వారికి మాత్రం 60 రోజుల వరకు గడువు ఇస్తారు. అయితే కొందరు డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొంటున్నారు. తీరా ప్లాటు దక్కాక మిగతా మొత్తం చెల్లించలేక చేతులెత్తేస్తున్నారు. ఇంకొందరు తొలి విడత 33 శాతం డబ్బులు చెల్లించి మిగతా డబ్బు చెల్లించలేక పక్కకు తప్పుకుంటున్నారు. గడువులోపు చెల్లించకపోతే డిపాజిట్‌తో పాటు తొలి విడతలో చెల్లించిన 33 శాతం కూడా వదులుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నా.. పలువురు డబ్బులు కట్టలేక డిఫాల్టర్లుగా మారుతున్నారు. ఇలా మిగిలిపోయిన పాట్లకు మళ్లీ వేలం వేయాలని హెచ్‌ఎండీఏ యోచిస్తోంది.
హైదరాబాద్ శివారులోని బాచుపల్లి, పీర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలోని మేడిపల్లిలో హెచ్‌ఎండీఏ ఇటీవల లేఅవుట్లు వేలానికి పెట్టింది. బాచుపల్లిలో 27 ఎకరాల్లో 85 ప్లాట్లు, మేడిపల్లిలో 55 ఎకరాల్లో 133 ప్లాట్లు ఈ-వేలం ద్వారా అమ్మేశారు. బాచుపల్లిలో హెచ్‌ఎండీఏ నిర్ణయించిన ధర చదరపు గజానికి రూ.25 వేలు కాగా.. మేడిపల్లిలో చదరపు గజానికి రూ.32 వేలుగా నిర్ణయించారు. ఈ రెండు చోట్ల ప్లాట్లు దక్కించుకునేందుకు ఆశావాహులు పోటీపడ్డారు. మేడిపల్లిలో గరిష్ఠంగా చదరపు గజం రూ.50 వేలు పలికింది.
అయితే ఇక్కడ ప్లాట్లు దక్కించుకున్న పలువురు తొలివిడత డబ్బులు చెల్లించలేక చేతులెత్తేశారు. ఇలా మేడిపల్లిలో 50 నుంచి 60 ప్లాట్లు, బాచుపల్లిలో 20 నుంచి 30 వరకు ప్లాట్లు దక్కించుకున్న వారు డిఫాల్టర్లుగా మిగిలిపోయారు. ఎలాగైనా ప్లాట్లు దక్కించుకోవాలనే ఉద్దేశంతో అధిక ధర పెట్టి కొంటున్న కొందరు.. తర్వాత డబ్బులు సర్దుబాటు కాక చెల్లించటం లేదు. సమయానికి బ్యాంకుల నుంచి లోన్లు రాకపోవడం, అంతా వైట్‌లో డబ్బులు చెల్లించాల్సి రావడంతో చెల్లించలేక తప్పకుంటున్నారు. మరికొందరైతే ఈ వేలం తర్వాత అక్కడ క్షేత్రస్థాయిలో అంత ధర లేదని నిర్ధారించుకొని డబ్బులు కట్టేందుకు వెనకడుగు వేస్తున్నారు.