పశ్చిమ బెంగాల్‌లో శనివారం పంచాయతీ ఎన్నికల పోలింగ్ హింసాత్మకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల జరిగిన ఘర్షణల్లో 11 మంది మృతి చెందారు. మరణించిన వారిలో ఆరుగురు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కాగా, బీజేపీ, లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వారితో పాటు సామాన్యులు ఉన్నారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడినవారిలో పోలీసులూ ఉన్నారు. భద్రత కల్పించడంలో కేంద్ర బలగాలు పూర్తిగా వైఫల్యం చెందాయని తృణమూల్ ఆరోపించింది. రాష్ట్రంలో చాలాచోట్ల బ్యాలెట్ బాక్సులను ధ్వంసం చేశారు. ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఘర్షణలు చెలరేగాయి. పలు ప్రాంతాల్లో బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లారు. కొన్నిచోట్ల వాటిని తగులబెట్టారు. వివిధ పార్టీల కార్యకర్తలు పోలింగ్ బూత్ లలోకి వెళ్లి సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుండి పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
లోక్‌సభ ఎన్నికల ముందు జరుగుతున్న ఈ ఎలక్షన్స్‌ని అధికార తృణమూల్ కాంగ్రెస్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే 2024 ఎన్నికలకు ఇది లిట్మస్ టెస్ట్ లాంటిది. రాజకీయాలనూ శాసించగలిగే స్థాయి ఈ పంచాయతీ ఎన్నికలకు ఉంది. ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి అల్లర్లు మొదలయ్యాయి. రెండు పోలింగ్ బూత్‌లలో బ్యాలెట్ బాక్స్‌లను ధ్వంసం చేశారు. ఈ గొడవల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. జూన్ 8న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడో ఓ చోట అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. ఓ పోలింగ్ బూత్‌లోకి బీజేపీ కార్యకర్త ఎంటర్ అవ్వాలని చూడగా అక్కడే ఉన్న టీఎంసీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఒక్కసారిగా వాగ్వాదానికి దిగారు. పరిస్థితులు అదుపు తప్పి నేరుగా చంపేంత వరకూ వెళ్లాయి. కానీ..టీఎమ్‌సీ మాత్రం ఇవి తప్పుడు ఆరోపణలని కొట్టి పారేస్తోంది. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న వ్యక్తినీ హత్య చేశారు. తృణమూల్ పార్టీ కార్యకర్తల్ని చంపేస్తున్నా..కేంద్ర భద్రతా బలగాలు ఏమీ పట్టించుకోవడం లేదని కొందరు మంత్రులు మండి పడుతున్నారు. అటు బీజేపీ మాత్రం తృణమూల్ కారణంగానే రాష్ట్రం ఇలా అయిందని ఆరోపిస్తోంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని, కార్యకర్తలు హత్యలు చేస్తున్నారమని మండి పడింది. ఈ ఘటనలపై గవర్నర్ కీలక భేటీ నిర్వహించారు. ప్రత్యేకంగా అని తన నివాసంలో ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నారు.
బెంగాల్ లోని గ్రామీణ ప్రాంతాల్లోని 73,887 స్థానాల్లో ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. 22 జిల్లా పరిషత్‌లు, 9,730 పంచాయతీ సమితులు, 63,229 గ్రామ పంచాయతీ స్థానాల్లోని దాదాపు 928 స్థానాలకు 2.06 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 5.67 కోట్ల ఓటర్లు ఉన్నారు. దాదాపు 600 కంపెనీల కేంద్ర బలగాలు, 70 వేలమంది రాష్ట్ర పోలీసులు విధుల్లో ఉన్నారు. గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ నార్త్ 24 పరగణాస్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి, హింసలో గాయపడిన ప్రజలను కలిశారు. ఓటర్లతోనూ సంభాషించారు.