11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు, విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలిన వేయి స్తంభాల ఆలయ విశేషాలు మీకోసం..
వరంగల్ నుంచి సూమారు 5 కి.మీ దూరంలోనూ హనుకొండలో కొలువై ఉంది. కాకతీయుల శిల్పకళా శైలితో అలరారే ఈ త్రికూటాలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చామూర్తిగా లింగ రూపంలో భక్తుల పాలిట కొంగుబంగారమై కొలువైనాడు.
రుద్రేశ్వరాలయం ముఖద్వారంపై మనోహరమైన తోరణశిల్పం, నర్తించే శిల్పాలు, రంగ మండప స్తంభాలు, ఆలయ రాతి గోడలు, అంతరాలయ ద్వారాలు, అధ్భూతమైన శిల్పాలతో ఈ ఆలయం ఆకర్షిస్తుంది.
ఈ ఆలయంలో మొత్తం మూడు గర్భాలయాలు ఉన్నాయి. తూర్పుముఖంగా ఉన్న దానిలో శివలింగ మూర్తి, దక్షిణ ముఖంగా ఉన్న దానిలో వాసుదేవరా అనే పేరుతో విష్ణుమూర్తి విగ్రహం, పశ్చిమ ముఖంగా ఉన్న దానిలో సూర్య దేవర విగ్రహములు ప్రతిష్టించబడ్డాయి. ఈ రకమైన నిర్మాణం ఉంది కనుకే ఈ నిర్మాణాన్ని త్రికూటాలయం అంటారు.
ఆలయ ముఖమండపానికి ఉత్తరాభిముఖమైయున్న నల్లరాతితో చెక్కిన నంది విగ్రహం నిజమైన వృషభరాజంలా జీవకళ ఉట్టిపడుతుంది. కళ్యణ మంటపానికి, ప్రధానాలయాలకు మధ్యన నంది ఠీవీగా దర్శనమిస్తుంది.
ఆనాటి రహస్య సైనిక కార్యకలాపాల కొరకై ఓరుగల్లు కోట, భద్రకాళి దేవాలయం.. ఇతర నిగూఢ కాకతీయ సామ్రాజ్య స్థావరాలను కలుపుతూ భూ అంతర్భాగం నుండి నెలకొల్పిన మార్గపు ద్వారాన్ని కూడా దర్శించవచ్చు.
ఈ ఆలయం మొత్తం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉన్న పునాదిమీద నిర్మించబడింది. ఈ పునాది 31 మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పుతో చాలా విశాలంగా శ్రీ చక్రం ఆకారంలో నిర్మింపబడ్డది.
ఈ ఆలయం వేయి స్తంభాలతో నిర్మితం కావడం మాత్రమే కాదు.. ఇక్కడ మరో విశిష్టత ఉంది. ఈ స్థంబాలపై నాణాలతో కానీ ఏదైనా లోహంతో కానీ తాకించినట్లయితే సప్తస్వరాలు, లయబద్ధమైన మధుర సంగీతం వినిపిస్తుంది.
మాఘ, శ్రావణ మరియు కార్తీక మాసాలలో ఆలయ సందర్శన విశేష ఫలాన్నిస్తుందని నమ్మకం. మహా శివరాత్రి, కార్తీక పౌర్ణమి, గణేశ నవరాత్రుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. మహా శివరాత్రి, కార్తీక పౌర్ణమి పర్వదినాలలో ఇసుక వెస్తే రాలనంతగా భక్త జన సందోహం రుద్రేశ్వరున్ని దర్శిస్తారు.