సినిమా థియేటర్లకు వెళ్లి సినిమాలు చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రేక్షకులు సినిమా థియేటర్ వరకు రావడం లేదని భావించిన వ్యాపార సంస్థలు.. వారి వద్దకే ఎంటర్‌టేన్‌మెంట్‌ను తీసుకెళ్లాలని భావించాయి. భావించిందే తడువుగా ఓటీటీలను ప్రారంభించాయి. అందులో భాగంగానే డిస్నీప్లస్ హాట్ స్టార్, ఆహా, నెట్‌ఫ్లెక్స్, సన్ నెట్, జీ5, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ఓటీటీ సంస్థలు వచ్చాయి. ఇపుడు కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు నెల రోజుల నుంచి 6 నెలలోపే.. ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలు అయితే థియేటర్లలో విడుదల చేయడానికి బడ్జెట్ లేకపోవడంతో.. ఓటీటీ వేదికగా రిలీజ్ అవుతున్నాయి. మరికొన్ని రియాలిటీ షోలు కూడా ఓటీటీల ద్వారా కొనసాగుతున్నాయి. అంత ప్రాధాన్యత ఉన్న ఓటీటీల్లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఒకటి, అయితే ఈ మధ్య కాలంలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ నుంచి వినియోగదారులు తమ సబ్‌స్ర్కిప్షన్‌ను తొలగించుకుంటున్నారు. ఇప్పటి వరకు సుమారు 1.25 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు హాట్‌స్టార్ నుంచి తప్పుకున్నట్టు తెలిసింది. పాస్‌వర్డ్ షేరింగ్‌పై పరిమితులు తీసుకురావాలని భావిస్తున్నట్టు సంస్థ ప్రకటించిన నేపథ్యంలో సబ్‌స్క్రైబర్లు తప్పుకుంటున్నట్టు తెలుస్తోంది.
డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫాం నుంచి మూడో త్రైమాసికంలో కోటి 25 లక్షల చందాదారులు తప్పుకున్నారు. కొద్ది రోజుల క్రితం పాస్‌వర్డ్ షేరింగ్‌పై పరిమితులు తీసుకురానున్నట్లు ఓటీటీ సంస్థ నుంచి వార్తలు వచ్చాయి. ఈ కారణంతోనే ఎక్కువ మంది ఓటీటీ నుంచి వీడిపోతున్నట్టు సమాచారం. ఎక్కువ సంఖ్యలో చందాదారులను కోల్పోయి 460 మిలియన్ల నికర నష్టాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ నమోదు చేసుకుంది. గత త్రైమాసికంలో అంతర్జాతీయంగా 7.4 శాతం మంది చందాదారులను కోల్పోగా.. రెండో త్రైమాసికంలో 157.8 మిలియన్లగా ఉన్న యూజర్ల సంఖ్య మూడో త్రైమాసికం నాటికి 146.1 మిలియన్లకు పడిపోయింది. తగ్గిన వారిలో అమెరికా, కెనడాలో ఉన్న వారే దాదాపు మూడు లక్షల మంది ఉన్నారు. తమ స్ట్రీమింగ్ సేవల్లో యాడ్ సపోర్ట్‌డ్ వెర్షన్‌ను యూరోప్, కెనడా, అమెరికాల్లో తొందరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు డిస్నీ ఇప్పటికే ప్రకటించింది. తమ వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చేందుకు సహాయపడే బహుళ మార్కెట్ల కోసం వేచిచూస్తున్నామని.. తక్కువ పెట్టుబడితో మెరుగైన సేవలు అందించే మార్కెట్లు ఉన్నాయని డిస్నీప్లస్ హాట్‌స్టార్ సీఈఓ బాబ్ ఇగర్ తెలిపారు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ తీసుకొచ్చిన యాడ్ ఫ్రీ డిస్నీ ప్లాన్‌తో పాటు హులు ప్లాన్ ధరల పెంపుతో కంపెనీ తిరిగి లాభదాయకంగా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే త్వరలోనే తెలుగులో బిగ్‌బాస్ రియాలిటీ షో ప్రారంభం కానున్న నేపథ్యంలో .. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రైబర్లు పెరిగే అవకాశం ఉంటుందని కూడా సంస్థ రీజియన్ అధికారులు చెబుతున్నారు.