పార్టీ మారడంపై.. తనపై వస్తున్న విమర్శలకు గానూ ట్విట్టర్ వేదికగా సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి తీవ్రంగా స్పందించారు. తనపై వస్తున్న విమర్శలను విజయశాంతి ఖండించారు. బీజేపీని వీడటానికి గల కారణాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పార్టీ మారారు అని విమర్శించే వాళ్లు ఒకటి తెలుసుకోవాలని సామాజిక వేదికగా సూచించారు.
ఆ నాడు బండి సంజయ్, కిషన్‌రెడ్డి మరికొందరు బీజేపీ ప్రముఖులు అనేకసార్లు తన వద్దకు వచ్చి బీఆర్ఎస్ అవినీతిపై తప్పక చర్యలుంటాయని చెప్పారని తెలిపారు. అందరూ సమర్థిస్తే కేంద్రంలోని బీజేపీ ఎంతవరకైనా కొట్లాడదామని చెప్పి తనను వివేక్ వెంకటస్వామిని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఒప్పించారని వివరించారు. అందుకు కేంద్ర పెద్దలతో హామీ ఇప్పించి తనను చేర్చుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని దుర్మార్గ పాలన పోవాలని, తాము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బాగుంటే చాలు అన్న ఒకే ఒక్క కారణంతో.. ఇన్ని సంవత్సరాలుగా పనిచేసిన కాంగ్రెస్‌ను వదిలి బీజేపీకి వెళ్లినట్లు పేర్కొన్నారు.
కానీ కమలం పార్టీ తమకు ఇచ్చిన మాట నిలబెట్టుకోక తమను మోసగించిందని ఆరోపించారు. బీఆర్ఎస్‌తో, బీజేపీ అవగాహన పెట్టుకున్నట్లు తెలిసిన తరువాతనే ఇంతమంది నాయకులు రాజీనామాలు చేసి బయటకెళ్లారని ఆరోపించారు. విమర్శలు చేయడం తేలికగా ఉన్నప్పటికీ.. ఆత్మ పరిశీలన చేసుకోవడం అవసరం అని విజయశాంతి ట్వీట్ చేశారు.