వర్మ వ్యూహం నెగ్గుతుందా.. లోకేష్ ప్రతి వ్యూహం ఫలిస్తుందా..?
అసలే ఏపీలో ఎన్నికల టైం. వైసీపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇలాంటి టైంలో అగ్నికి ఆజ్యం పోసినట్టు సీన్‌లోకి ఎంటరైంది వ్యూహం సినిమా. ఏపీ రాజకీయాలను మరింత హీటెక్కించేలా చేసింది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి వేదికైంది. ఏపీ రాజకీయాల నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా తీయడంతో.. పొలిటికల్ కాంట్రవర్సికి దారి తీసింది. రాబోయే ఏపీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే జగన్‌కు అనుకూలంగా, చంద్రబాబును కించపరిచేలా వ్యూహం తెరకెక్కిందని టీడీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. వ్యూహం సినిమాను అడ్డుకునేందుకు.. ప్రతి వ్యూహంగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు లోకేష్. సినిమా రిలీజ్‌ను ఆపాలని, తమను కించపరిచేలా తీసిన వ్యూహం.. సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు.. జనవరి 11న వరకు సినిమాను ఆపాలని ఆదేశించింది.
హైకోర్టు నిర్ణయంతో డిసెంబర్ 29న రిలీజ్ కావాల్సిన వ్యూహం సినిమాకు బ్రేక్ పడింది. ఐతే న్యాయస్థానం తీర్పుపై దర్శకుడు వర్మ స్పందించారు. న్యాయస్థానం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేసిందనే వార్తలను ఆయన ఖండించారు. ‘కొన్ని ఛానెళ్లలో వస్తున్నట్లుగా వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు కాలేదు. CBFC నుంచి సర్టిఫికెట్ ఇవ్వడానికి సంబంధించిన రికార్డులు జనవరి 12 నాటికి సమర్పించాలని హైకోర్టు అడిగింది.’ అని స్పష్టం చేశారు. వ్యూహం’ సినిమాపై లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఇలాంటి సినిమాలను తీయడం ఫ్యాషన్ అయిపోయిందని ఎద్దేవా చేశారు. ఇలాంటి సినిమాలకు సీఎం జగన్ ఫండింగ్ చేస్తున్నారని ఆరోపించారు. వర్మ నిజంగా సినిమా తీయాలకుంటే కోడి కత్తి, హూ కిల్డ్ బాబాయ్, ప్యాలస్ లో జరుగుతున్న అవినీతి ఇలాంటి అంశాలపై తీసుకోవచ్చని అన్నారు లోకేష్.
ఏపీ రాజకీయాలపై సినిమా, అది కూడా ఎన్నికల ముందు రిలీజ్. డిసెంబర్ 29న వ్యూహం, కరెక్ట్‌గా అసెంబ్లీ ఎన్నికల టైంలో శపథం సినిమాను తీసుకురావాలనేది వర్మ ప్లాన్. గతంలో ఇలాగే ఎన్నికల ముందు లక్ష‌్మీస్ ఎన్టీఆర్ సినిమా వదిలారు ఆర్జీవీ. ఇప్పుడు ఇలా వ్యూహం పన్నారు. వైసీపికి అనుకూలంగా సినిమా ఉండటంతో.. ఆ పార్టీ శ్రేణులు క్యూరియాసిటితో ఉన్నారు. జగన్‌ను ఎలా చూపించబోతున్నారనే ఆసక్తితో ఉన్నారు. ఇందులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ క్యారెక్టర్లు కూడా ఉన్నాయి. దీంతో తమ నేతలను కించపరిచేలా చూపిస్తున్నారని టీడీపీ, జనసేన నేతలు ఫైర్ మీద ఉన్నారు. జగన్‌ను హీరో చేయడానికి చంద్రబాబును విలన్‌గా చిత్రీకరిస్తారా అనేది తమ్ముళ్ల మాట. అటు వైసీపీ మాత్రం.. అందులో కల్పితం ఏం లేదని, ఉన్నది ఉన్నట్టే… జరిగిందే వర్మ చూపించబోతున్నారని వైసీపీ నేతల కౌంటర్. మొత్తానికి వ్యూహం సినిమా..ఏపీ ఎన్నికలను ఎలా ప్రభావం చేయబోతుంది. జనవరి 11 తర్వాత అయినా..వ్యూహం రిలీజ్‌కు మోక్షం దక్కుతుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి వర్మ వ్యూహం నెగ్గుతుందా లేక లోకేష్ ప్రతి వ్యూహం ఫలిస్తుందా అనే ఆసక్తి నెలకొంది