లోక్‌సభ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్
తెలంగాణలో కాంగ్రెస్ మరో అగ్ని పరీక్షను ఎదుర్కొబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచి అధికారం చేపట్టిన చెయ్యి పార్టీ 2 నెలల గ్యాప్‌లోనే లోక్‌సభ ఫైట్‌కు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ ఎన్నికల్లో గెలిచి.. తెలంగాణలో తమ పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. ప్రతిపక్షాల విమర్శలకు ఏమాత్రం తావు ఇవ్వకుండా మెజార్టీ సీట్లు గెలిచి ప్రజల మద్దతు తమకే ఉందనే మేసేజ్‌ను పంపాలని చూస్తోంది. మరోవైపు కేంద్రంలో అధికారం చేపట్టేందుకు కాంగ్రెస్ హైకమాండ్‌కు ఇది డూ ఆర్ డై గా మారిన నేపథ్యంలో ప్రతి ఒక్క సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇప్పటికే కేంద్రంలో రెండు టర్మ్‌లు అధికారానికి దూరమైంది. ఇప్పుడు కూడా నెగ్గకపోతే పార్టీ ఉనికే ప్రమాదంలో పడే అవకాశం ఉండడంతో ఈసారి ఎలాగైనా గద్దనెక్కాలని శాయశక్తులా పోరాడుతోంది. ఓ వైపు కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తూనే.. మరోవైపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ను బలపేతం చేసే పనిలో పడింది. అందుకే ఏఐసీసీ స్థాయిలో వరుస రివ్యూ జరుపుతోంది. తాజాగా తెలంగాణ మంత్రులను ఢిల్లీకి పిలిపించుకుని.. ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తోంది.
తెలంగాణలో 12ఎంపీ సీట్లు గెలవాలనే టార్గెట్‌తో ముందుకు వెళ్తోంది టీకాంగ్రెస్. అందుకోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన దీపాదాస్ మున్షిని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా నియమించింది అధిష్టానం. అలాగే లోక్‌సభ నియోజకవర్గాల వారిగా మంత్రులకు ఇంఛార్జి బాధ్యతలను అప్పగించింది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటికి రెండు స్థానాల చొప్పున, మిగిలిన మంత్రులందరికీ ఒక్కో ఎంపీ స్థానానికి ఇంఛార్జి బాధ్యతలు అప్పగించారు. పార్టీ లీడర్లను సమన్వయం చేసుకుంటూ పథకాలను ప్రజల్లో్కి తీసుకెళ్లి తమ వైపుకు తిప్పుకోవాలని చూస్తోంది. ఈనెల చివరి కల్లా నామినేటెడ్ పదవులను కూడా పూర్తి చేయాలనే యోచనలో ఉంది హైకమాండ్. అలాగే ఉమ్మడి జిల్లాల వారిగా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ఓడిన ఎమ్మెల్యే క్యాండిడేట్లతోనూ సమీక్షలు జరుపుతున్నారు. నియోజకవర్గానికి 10కోట్లు ఇస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు రేవంత్.
ఐతే లోక్సభ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుకున్న ఫలితాలు సాధించడం అంతా ఆశామాషీ కాదనే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే లోక్‌సభ ఎన్నికల రిజల్ట్స్ రిపీట్ అవుతాయి అనుకోవడం సరికాదు. తెలంగాణలో గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను చూస్తే ఇట్టే అర్థం అవుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 88సీట్లతో భారీ మెజార్టీ సాధించింది. కానీ 4నెలల వ్యవధిలోనే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 9 స్థానాలకే పరిమితి అయింది. ఇందులో బీజేపీ నాలుగు స్థానాలు గెలుచుకుంటే.. కాంగ్రెస్ 3లోక్‌సభ సీట్లు సాధించింది. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64సీట్లను సాధించింది. ఇలాంటి టైంలో ఇటు ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్, మరో జాతీయ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కోక తప్పదు కాంగ్రెస్‌కు. పైగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు సాధించి లోక్‌సభకు వచ్చే సరికి 4స్థానాలు గెలుచుకుంది. అలాంటిది ఇప్పుడు 8అసెంబ్లీ సాధించడంతో.. లోక్‌సభ ఎన్నికల్లో మరింత పట్టుకోసం వ్యూహాలు రచిస్తోంది కమలం పార్టీ. ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్.. క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. పైగా అప్పుడే లోక్‌సభ నియోజకవర్గాల వారిగా..కేటీఆర్ సమీక్షలు జరుపుతున్నారు. అసెంబ్లీ లో జరిగిన తప్పులు దొర్లకుండా జాగ్రత్త పడుతున్నారు. వ్యతిరేకత ఉన్న సిటింగ్‌లను మార్చే యోచనలో ఉండడంతో.. బీఆర్ఎస్, బీజేపీ వైపు నుంచి కాంగ్రెస్ టఫ్ ఫైట్ తప్పనట్టే కనిపిస్తోంది.