మహాలక్ష్మి పథకం అందుబాటులోకి రావడంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది, ఆర్డనరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ లలో 20శాతం రద్దీ పెరిగినట్టు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. రంగారెడ్డి రీజియన్ పరిధిలోని 8 డిపోల పరిథిలో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగినట్టు తెలుస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో 60 శాతం మంది మహిళా ప్రయాణికులే కనిపిస్తున్నారు. ఆర్టీసీ బస్సల్లో రద్దీ పెరిగితే, మెట్రో రైళ్లలో రద్దీ తగ్గింది.
ప్రైవేటు వాహనాల్లో వెళ్లే వారు కూడా ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ బస్సులపై ఆసక్తి చూపుతున్నారు. దిల్‌సుఖ్‌నగర్, సికింద్రాబాద్, ఈసీఐఎల్, కూకట్ పల్లి, మియాపూర్, కోఠి, నాంపల్లి, ఎస్ఆర్ నగర్, అమిర్ పేట బస్టాండులు మహిళా ప్రయాణికులతో రద్దీగా మారాయి. గ్రేటర్ లో ఆర్టీసీ ఆదాయానికి గండి పడింది.గ్రేటర్ లో ప్రతి రోజు ఆర్టీసీ ఆదాయం రెండు కోట్ల 50 లక్షలు వస్తే, ఇప్పుడు రెండు కోట్ల రూపాయలు మాత్రమే వస్తున్నాయి. ఈలెక్కన గ్రేటర్ లో ఆర్టీసీకి రోజుకి 50 లక్షల రూపాయలు భారం పడుతోంది.
ఎంజీబీఎస్, జేబీఎస్‌ల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 3వేల 200 బస్సులు నడుపుతోంది. జిల్లాల నుంచి ప్రతి రోజు లక్షా 20 వేల మంది నుంచి లక్షా 50 వేల మంది ప్రయాణిస్తుంటే, వీరిలో 40 శాతం మంది మహిళలే ఉంటున్నారు. బస్టాండుల్లో సూపరె్ లగ్జరీ బస్సులున్నా, ఉచిత ప్రయాణంతో చాలా మంది మెట్రో ఎక్స్ ప్రెస్ కోసం వేచి చూస్తున్నారు. హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లే పల్లెవెలుగు బస్సులు రద్దీగా మారాయి.