బీఆర్ఎస్ అభ్యర్థులను అప్రమత్తం చేస్తున్న గులాబీ బాస్
ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ అభ్యర్థులను నిత్యం అప్రమత్తం చేస్తున్నారు. రోజు నియోజకవర్గాల వారిగా అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ఇతర ముఖ్యనాయకులతో కేసీఆర్ నేరుగా ఫోన్లో మాట్లాడుతున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణంపై ఆరా తీస్తున్నారు. తన వద్ద ఉన్న తాజా రిపోర్టుల్లోని సానుకూల, ప్రతికూలతలను విశ్లేషిస్తూ ఏయే అంశాల్లో మెరుగుపడాలో వారికి సూచిస్తున్నారు గులాబీ బాస్
పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో.. ఏ చిన్న అంశాన్ని కూడా విస్మరించవద్దని కేసీఆర్ అభ్యర్థులకు స్పష్టం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రతికూలతలు అధికంగా ఉండి.. నాయకుల మధ్య సమన్వయం లేని నియోజకవర్గాల్లో కింది స్థాయి నేతలతోనూ కేసీఆర్ నేరుగా ఫోన్లో మాట్లాడుతున్నట్లు తెలిసింది. పోటీ గట్టిగా ఉన్న చోట ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచిస్తున్నట్లు సమాచారం. ఇదే తరహాలో కొందరు జిల్లా పరిషత్ ఛైర్మన్లు, జడ్పీటీసీ సభ్యులతోనూ పార్టీ అధినేత మాట్లాడి.. సమన్వయంతో ముందుకు సాగాలని సూచించినట్లు తెలిసింది.
ఓటర్లను కేసీఆర్ ఐదు విభాగాలు విభజించారు. ప్రతి నియోజకవర్గంలోనూ గ్రామాలు, వార్డులవారీగా ఓటర్లను ఐదు విభాగాలుగా గుర్తించి, ఏయే వార్డుల్లో ఏ విభాగానికి చెందిన ఓట్లు ఎన్ని ఉన్నాయనే జాబితాను పార్టీ రూపొందించింది. బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు, ప్రభుత్వ పథకాల లబ్ధిపొంది కచ్చితంగా తమకే ఓటు వేస్తారనుకునే వారిని ‘సానుకూల’ వర్గంగా.. పార్టీ అభిమానులై ఉండి, పథకాల ద్వారా లబ్ధిపొందినా.. వేర్వేరు కారణాల వల్ల అభ్యర్థి పట్ల ‘అసంతృప్తి’గా ఉన్న వారిని రెండో వర్గంగా.. ప్రతిపక్ష పార్టీల అభిమానులు, కార్యకర్తలు మూడో వర్గంగా.. ఏ పార్టీతోనూ సంబంధం లేకపోయినా ప్రభుత్వం పట్ల ‘వ్యతిరేకత’ ఉన్న వారు నాలుగో వర్గంగా.. వీటన్నింటిలోనూ ఇమడకుండా తమ ఓటును ఎవరికి వేయాలో ఇంకా నిర్ణయం తీసుకోని ‘తటస్థ’ ఓటర్లను ఐదో వర్గంగా విభజించినట్లు తెలిసింది.
ఇందులో ప్రతిపక్ష పార్టీల అభిమానులు, కార్యకర్తలు ఎలాగూ బీఆర్ఎస్‌కు ఓట్లు వేయరు కాబట్టి వారిపై దృష్టి కేంద్రీకరించడంలేదు. ఇక మిగిలిన తటస్థ, అసంతృప్తి, వ్యతిరేక కేటగిరీల ఓటర్లను ఆకర్షించడంపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్లుగా సమాచారం. ఇందులో భాగంగా ప్రతి 100 ఓట్లకు నలుగురు ఇన్‌ఛార్జులను నియమించారు. ఆ నలుగురి ఓట్లు కచ్చితంగా ఆ 100 ఓట్ల పరిధిలోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
పోలింగ్ రోజున ఓటర్లందరినీ పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లే బాధ్యత ఆ నలుగురిదే. ముఖ్యంగా ఆఖరి మూడు రోజుల్లో ఏం చేయాలో.. ఎప్పటికప్పుడు అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నట్లుగా సమాచారం. ప్రజల నాడిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. దానికి అనుగుణంగా వ్యూహాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా తెలిసింది.