ప్రముఖ నటుడు చంద్రమోహన్ ఇకలేరు. తన నటనతో దాదాపు ఐదు దశాబ్దాల పాటు అలరించిన చంద్రమోహన్ ఉదయం కన్నుమూశారు. చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. మొత్తం 932 సినిమాల్లో చంద్రమోహన్ నటించారు. 1966లో రంగులరాట్నం సినిమాతో ఆయన సినీ ప్రస్థానం ఆరంభమైంది. అప్పటి నుండి సహనాయకుడిగా, కథనాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతారు
కొత్త హీరోయన్‌లకు లక్కీ హీరో చంద్రమోహన్ అని చెబుతారు. చంద్రమోహన్ పక్కన మొదటి సినిమాలో నటిస్తే ఆ హీరోయిన్ దశ తిరిగిపోతుందని చెబుతారు. సిరిసిరిమువ్వలో జయప్రద, పదహారేళ్ళ వయసులో శ్రీదేవి తమ నటజీవితం ప్రాంభంలో చంద్రమోహన్‌తో నటించి తరువాత తారాపథంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు చంద్రమోహన్. హీరోగా రంగులరాట్నం చిత్రంతో మొదలుపెట్టి, హాస్యనటుడిగా మారి తర్వాత కాలంలో కారెక్టర్ ఆర్టిస్ట్‌గా చిత్రసీమలో స్థిరపడ్డారు.
చంద్రమోహన్ నటించిన సుఖదుఃఖాలు, పదహారేళ్ళ వయసు, సిరిసిరిమువ్వ, సీతామాలక్ష్మి మొదలైనవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆ కాలంలో వీరితో ఎందరో కథానాయికగా నటించి అగ్రస్థానాన్ని చేరుకున్నారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్ ఆపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చంద్రమోహన్ మృతితో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.