పారిశుద్ధ్య కార్మికురాలిగా MBA చదివిన యువతి!
చదివింది ఎంబీఏ( ఫైనాన్స్). మంచి ఉద్యోగం సంపాదించి గౌరవ ప్రదంగా బతకాలని ఆశ పడింది ఆ యువతి. కుటుంబాన్ని బాగా చూసుకోవాలని ఎన్నో కలలు కన్నది కానీ. ఆ పేద మహిళ కలలన్నీ కల్లలే అయ్యాయి. ఆర్థిక పరిస్థితులు ఆమె ఆశలపై నీళ్లు చల్లాయి. కుటుంబ సమస్యలు, ఆర్థిక భారంతో ముందుకు వెళ్లలేక చివరికి మున్సిపల్ కార్మికురాలిగా మారిపోయింది. గ్రామ పంచాయతీలో స్లిపర్గా పని చేస్తూ కుటుంబాన్ని వెళ్లదీసుకుంటోంది.
ఎంబీఏ( ఫైనాన్స్) చదివిన ఆ ఉన్నత విద్యావంతురాలు ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పారిశుద్ధ్య కార్మికురాలిగా మారారు. ఎంబీఏ (మార్కెటింగ్) చేసిన ఆమె భర్త ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన ఆ ఇరువురు దంపతులు ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. కొలువుల కోసం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో చేసేదేమీ లేక బ్రతుకు బండిని నడిపించాలంటే ఏదో ఒక పని అవసరమని ఒకరు పారిశుద్ధ కార్మికురాలుగా మరొకరు డ్రైవర్ గా కాలం వెళ్లదీస్తున్నారు. తమ విద్యార్హతకు అనుగుణంగా ప్రభుత్వం ఉపాధి కల్పిస్తే రుణపడి ఉంటామంటున్నారు ఆ ఉన్నత విద్యావంతులు..
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపూర్‌కు చెందిన బొక్కల మానస డిగ్రీ రెండో సంవత్సరంలో ఉన్నప్పుడు తన చిన్ననాటి మిత్రుడు, దగ్గరి బంధువు మాదాసి దిలీప్‌కుమార్‌ను కుటుంబసభ్యుల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. దిలీప్‌కుమార్ ఎంబీఏ(మార్కెటింగ్) చేశారు. పెళ్లయిన తర్వాత మానసతో ఎంబీఏ(ఫైనాన్స్) చదివించారు. 2016లో ఆమె ఎంబీఏ పూర్తి చేశారు. కానిస్టేబుల్ ఉద్యోగం సాధించేందుకు మానస కష్టపడినా.. ఒక్క మార్కు తేడాతో తప్పిపోయింది. ఆ తరువాత భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కొలువుల కోసం ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో దిలీప్‌కుమార్ తండ్రి కొమురయ్య చనిపోయారు. తల్లికి చేదోడుగా దిలీప్‌కుమార్ స్వగ్రామంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత దిలీప్‌కుమార్-మానసలకు కుమార్తె, కుమారుడు జన్మించారు. ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న క్రమంలో మూడున్నరేళ్ల కుమార్తె చనిపోవడంతో మానస కుంగుబాటుకు గురయ్యారు.
కుటుంబ, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా భార్యాభర్తలిద్దరూ సొంతూరిని వదిలి వెళ్లలేని పరిస్థితిలో.. అక్కడే ఉపాధి వెతుక్కోవాలనుకున్నారు. మానస వెంకటాపూర్ పంచాయతీ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా 8 వేల వేతనానికి పనిచేస్తుండగా, దిలీప్ ఓ ప్రైవేటు కంపెనీలో ఆటోడ్రైవర్‌గా చేరారు. దొరికిన పనితో సంతృప్తిగానే ఉన్నామని.. తాము చదివిన చదువుకు తగ్గట్టుగా ప్రభుత్వం ఉద్యోగ అవకాశం కల్పించాలని మానస కోరుతున్నారు.