చాలా దూరం వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా ట్రైన్ జర్నీని ఆశ్రయిస్తుంటారు. అలాంటి వారు ముందస్తుగానే టికెట్లు బుక్ చేసుకుంటూ ఉంటారు. చాలా మంది ప్రయాణికులు కొన్ని రోజులు లేదా నెలల ముందుగానే.. వారి ట్రైన్ టికెట్లు బుక్ చేసుకుంటుంటారు. అందువల్ల చివరి దశలో ప్రయాణం చేయాల్సిన వారికి టికెట్లు దొరకవు. అయినప్పటికీ.. వెయిటింగ్ లిస్టులో ప్రయత్నిస్తారు. కానీ.. ఎప్పుడు కన్ఫామ్ అవుతాయో.. అసలు టికెట్లు దక్కుతాయో లేదో అనే టెన్షన్ వేధిస్తూ ఉంటుంది. ఇలాంటి వారు.. తరచూ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ ఉంటారు.
సాధారణంగా మనం టికెట్ బుక్ చేసుకున్న సమయంలో దానిపై పీఎన్ఆర్ నంబర్ వస్తుంది. చాలా మంది పీఎన్ఆర్ను బట్టి వారి టికెట్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు. అయితే.. ఈ పీఎన్ఆర్ స్టేటస్ చెక్ చేయడం అంత ఈజీగా ఉండదు. దాంతో నానా ఇబ్బందులు పడుతుంటారు. అయితే.. ఇప్పుడు గతంలో మాదిరిగా అంత కష్ట పడాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో లేదా ఆఫ్‌లైన్‌లో సింపుల్‌గా మీ PNR STATUS చెక్ చేసుకోవచ్చు.పీఎన్ఆర్ స్టేటస్ అంటే ఏమిటి..?
పీఎన్ఆర్ అంటే Passenger Name Record(PNR) అని అర్థం. ఇది రైలు టికెట్లను బుక్ చేసుకునే ప్రతి ప్రయాణికుడికి 10 అంకెలతో కేటాయించే ప్రత్యేక సంఖ్య. రైలు ప్రయాణం చేయాలనుకున్నప్పుడు మీరు బుక్ చేసుకున్న ట్రైన్ పత్రం మధ్యలో లేదా దిగువన ఈ PNR నంబర్ కనిపిస్తుంది. ఈ పీఎన్ఆర్ స్టేటస్ చెక్ చేసుకోవడం ద్వారా మీ ట్రైన్ టికెట్ బుక్ అయిందా? లేదా? మీకు కేటాయించిన బెర్తు, సీటు నంబర్, ప్రయాణించే తేదీ, రైలు బుకింగ్ స్థితి (వెయిట్‌లిస్ట్, కన్ఫర్మ్, RAC) ఇలా మొదలైన వాటి గురించి కచ్చితమైన వివరాలన్ని సమగ్రంగా తెలుసుకోవచ్చు.