నేటితో అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టానికి తెర పడనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. 13 నియోజకవర్గాల్లో గంట ముందే క్యాంపెయిన్ ముగియనుంది. ప్రచారం ముగియగానే స్థానికేతరులు నియోజకవర్గాన్ని విడిచి వెళ్లాలని ఈసీ నిబంధన విధించింది. అలాగే.. సాయంత్రం 5 గంటల తరువాత రాజకీయ నాయకులు ఇంటర్వ్యూలు, రాజకీయ ప్రకటనలు చేయరాదని ఆదేశించింది. సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ ముగిసేవరకు వైన్ షాపులు మూసివేయనున్నారు. ఇక.. ఈ నెల 30న ఎన్నికలు.. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది
రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 2 వేల 290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్ల 26 లక్షలు కాగా.. పురుష ఓటర్లు ఒక కోటి 62 లక్షల 98 వేల 418 మంది ఉన్నారు. ఇక.. ఒక కోటి 63 లక్షల 17 వందల 05 మంది మహిళా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 2 వేల 676 మంది, సర్వీసు ఓటర్లు 15 వేల 406, ఓవర్సీస్ ఓటర్లు 2 వేల 944 మంది ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఎన్నికల విధుల్లో రెండున్నర లక్షల మంది సిబ్బంది పాల్గొనన్నారు. మరోవైపు.. పోలింగ్ కేంద్రాల వద్ద 45వేల మంది పోలీస్‌లతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. 50 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 35 వేల 356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిల్లో 10 వేలకుపైగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించిన ఈసీ.. అదనపు బలగాలను మోహరించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 250కి పైగా చెక్‌పోస్టులు, అంతర్‌రాష్ట్ర సరిహద్దుల్లో 166 చెక్‌పోస్టులతో ముమ్మర తనిఖీలు చేపట్టారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం, ఆసిఫాబాద్, రామగుండం, ఆదిలాబాద్, మహబూబాబాద్, నిర్మల్ లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో సెంట్రల్ ఫోర్స్‌తో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. భద్రాచలం, బెల్లంపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట, పినపాక, ఇల్లందు, ములుగు, భూపాలపల్లి, మంథని, చెన్నూరు, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలకు CRPF, CISF, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఎన్నికల షెడ్యూల్ నుంచి ఇప్పటివరకు దాదాపు 7వందల 9 కోట్లు సీజ్ చేసినట్టు ఈసీ అధికారులు వెల్లడించారు.