తొలి విడత ఎన్నికల ప్రచారం దాదాపు పూర్తి.. రెండో విడత ప్రచారం షెడ్యూల్ ప్రకటన
క్యాంపెయిన్ 2.O
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో గులాబీ బాస్ దూసుకుపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో తన మాటల తూటాలతో కేసీఆర్ దుమ్ము దులిపారు. ప్రజలకు సంక్షేమాన్ని వివరిస్తూనే.. ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌పై కారాలు, మిరియాలు నూరుతున్నారు. 75ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఎలాంటి అభివృద్ధి చేయలేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక.. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టడమే బీజేపీ పని అంటూ ఫైర్ అవుతున్నారు. మొత్తానికి ఫస్ట్‌ఫేజ్ క్యాంపెయిన్‌లో సీఎం కేసీఆర్.. తన ప్రసంగాలతో ప్రజలను ఆలోచించేలా చేశారు. ఇక.. ఇప్పుడు తొలి విడత ప్రచారం దాదాపు పూర్తికాబోతున్న నేపథ్యంలో రెండో విడత ప్రచారం షెడ్యూల్ ప్రకటించారు. ఈ నెల 13 నుంచి 28 వరకు 16 రోజుల పాటు సీఎం కేసీఆర్ నియోజకవర్గాల పర్యటన కొనసాగనుంది. మొత్తం 54 నియోజకవర్గాల సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొని, ప్రసంగించనున్నారు. ఈ నెల 25న గ్రేటర్ హైదరాబాద్ మొత్తానికి కలిసి ఒకేచోట భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
ఈనెల 13న ఉమ్మడి ఖమ్మంలోని దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేటలో ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. 14న పాలకుర్తి, హాలియా, ఇబ్రహీంపట్నం, 15న బోధన్, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, మెదక్, 16న ఆదిలాబాద్, బోథ్, నర్సాపూర్, నిజామాబాద్ రూరల్‌లో ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. 17న కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, పరకాల, 18న చేర్యాల, జనగాంలో రోడ్ షో నిర్వహించనున్నారు. 19న అలంపూర్, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, 20న మానకొండూర్, స్టేషన్ ఘన్ పూర్, నకిరేకల్, నల్గొండ, 21న మధిర, వైరా, డోర్నకల్ సూర్యాపేటలో సీఎం కేసీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు. 22న తాండూరు, కొడంగల్, మహబూబ్ నగర్, పరిగి, 23న మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్, పటాన్ చెరు, 24న మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లి, నవంబర్ 25న గ్రేటర్ హైదరాబాద్ లో భారీ సభ నిర్వహించనున్నారు. ఈ నెల 26 ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాక… 27న షాద్‌నగర్, చేవెళ్ల, ఆందోల్, సంగారెడ్డిలో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని, సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. ఇక.. ఈ నెల 28న వరంగల్ ఈస్ట్, వెస్ట్ తో పాటు.. గజ్వేల్ నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభతో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం ముగియనుంది.