తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. సీఎం రేవంత్‌రెడ్డి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొత్తగా కొలువుదీరిన రాష్ట్ర కేబినెట్‌లో మరో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. వీటిని ఎవరితో భర్తీ చేస్తారన్న చర్చ మొదలైంది. వాస్తవంగా రాష్ట్ర కేబినెట్‌లో ముఖ్యమంత్రి, 17 మంది మంత్రులు ఉండాలి. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డితోపాటు మరో 11 మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ఇంకో ఆరు మినిస్టర్ పదవులు ఖాళీగా ఉన్నాయి.
మంత్రివర్గంలో 11 మంది మంత్రులకు శాఖలు ఖరారయ్యాయి. కీలక శాఖలు సీఎం వద్దే ఉన్నాయి. కేబినెట్‌లో మరో ఆరు స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. ఈ స్థానాలను భర్తీ చేసేందుకు రేవంత్ సిద్దంగా ఉన్నారు. జాబితా సిద్దం చేసుకున్న ఆయన హైకమాండ్ ఆమోదం కోసం వెయిట్ చేస్తున్నారు. రేవంత్ తొలి మంత్రివర్గంలో సీనియర్లకు అవకాశం ఇచ్చారు. వారికి శాఖలు అప్పగించారు.
అయితే కీలక శాఖలు ఇంకా భర్తీ చేయాల్సి ఉంది. రేవంత్ ఇప్పటికే మరో ఆరుగురికి కేబినెట్ లో అవకాశం కల్పించేలా ప్రణాళికలతో సిద్దమయ్యారు. వారి కోసమే కొన్ని ప్రధాన శాఖలను పెండింగ్ పెట్టారు. అందులో హోం శాఖతో పాటుగా విద్యా, సాంఘిక సంక్షేమం, మున్సిపల్ వంటి కీలక శాఖలు ఉన్నాయి. ప్రస్తుత కేబినెట్‌లో నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు.
ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో 15 అసెంబ్లీ సీట్లు ఉంటే, ఒక్కటి కూడా కాంగ్రెస్ గెలవలేదు. రాష్ట్ర రాజధాని కావడంతో ఇక్కడి నుంచి కనీసం ఒకరిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నది. ఆ ఒక్క సీటు కోసం ఫిరోజ్ ఖాన్, అంజన్‌కుమార్ యాదవ్, మధు యాష్కిగౌడ్, మైనంపల్లి హన్మంతరావు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. వీళ్లు పోటీ చేసినప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయారు. మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీని మంత్రి వర్గంలోకి తీసుకుంటే, ఫిరోజ్ ఖాన్‌కు బెర్తు దక్కకపోవచ్చని పార్టీ నేతలు అంటున్నారు. మరో వైపు ఎమ్మెల్యే టికెట్‌ను త్యాగం చేసిన అద్దంకి దయాకర్, చిన్నారెడ్డి సైతం కేబినెట్‌లో స్థానంలో కోసం ఆసక్తి చూపుతున్నారు.
అయితే మిగిలి ఉన్న ఆరు స్థానాలకు 15 మంది పోటీ పడుతున్నారు. ఇందులో ఎమ్మెల్యేలుగా ఓడిన వారు ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి గడ్డం బ్రదర్స్ మధ్యే పోటీ నడుస్తోంది. అటు నిజామాబాద్ నుంచి షబ్బీర్ అలీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈయన నిజామాబాద్ అర్బన్‌లో ఓడినప్పటికీ ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మంత్రి పదవుల కోసం ఆశావహులు పెరుగుతుండడంతో ఈ నెల 14 తర్వాత జరిగే అసెంబ్లీ సమావేశాల తర్వాతే పూర్తిస్థాయి కేబినెట్‌ను ప్రకటించే అవకాశం కనిపిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు సామాజిక సమీకరణాల ప్రకారం కొత్తవారికి మంత్రులుగా అవకాశం కల్పించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.