తెలంగాణలో ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. అభ్యర్థుల భవితవ్యాన్ని 3 కోట్ల 26 లక్షలకు పైగా ఓటర్లు తేల్చనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35వేల,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 3కోట్ల 26లక్షల 2వేల 799మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల బరిలో 2వేల,290 మంది అభ్యర్థులు ఉన్నారు. వారిలో మహిళలు 221 మంది, పురుషులు 2,068 మంది, ఒక ట్రాన్స్ జెండర్ ఉన్నారు.
ఎన్నికల నేపథ్యంలో ఈనెల 30 వరకు మద్యం దుకాణాలు బంద్ ఉండనున్నాయి. దివ్యాంగుల కోసం పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 21వేల,686 వీల్ ఛైర్లను అధికారులు సిద్ధం చేశారు. 80 ఏళ్లు పైబడిన వారికి ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తారు. బ్రెయిలీ లిపిలోనూ ఓటరు స్లిప్పులు, నమూనా బ్యాలెట్లు అందిస్తారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు 644 మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 120 పోలింగ్ కేంద్రాలను దివ్యాంగులు, 597 పోలింగ్ కేంద్రాలను మహిళలు నిర్వహించనున్నారు. పోలింగ్ క్రతువులో 1లక్షల 85వేల మంది సిబ్బంది. 22వేల మంది మైక్రో అబ్జర్వర్లు పాల్గొననున్నారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలైన 13 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది. 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.
ఎన్నికల సందర్భంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. తెలంగాణ ఎన్నికల విధుల్లో 375 కంపెనీల కేంద్ర బలగాలు ఉన్నాయి. ఎన్నికల విధుల్లో అస్సాం రైఫిల్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. ఎన్నికల విధులలో 65 వేలమంది తెలంగాణ పోలీసులు ఉన్నారు. 18 వేల మంది హోంగార్డులు కూడా పనిచేస్తున్నారు. పోలింగ్ ముగిసేవరకు రాష్ట్రంలో 144 సెక్షన్ అమలులో ఉండనుంది. బుధవారం, గురువారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పోలింగ్ రోజు ఐటీ సంస్థలు సెలవు ప్రకటించాలని ఈసీ సూచించింది.