ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్‌కు మంజూరైన మధ్యంతర బెయిల్‌ను తదుపరి విచారణ జూలై 19 వరకు పొడిగిస్తున్నట్టు సుప్రీంకోర్టు బుధవారం ప్రకటించింది. బుధవారం వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను విచారించే వరకు బెయిల్ కొనసాగనుందని ప్రకటించింది. 2002 గోధ్రా అనంతర అల్లర్ల కేసుల్లో అమాయకులను ఇరికించేందుకు సాక్ష్యాధారాలను కల్పించారన్న ఆరోపణలపై లొంగిపోవాల్సిందిగా గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారిస్తోంది. రెగ్యులర్ బెయిల్ కోసం ఆమె చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.
గుజరాత్లో 2002లో జరిగిన అల్లర్ల విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందానికి, పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై ఆమెపై గతంలో కేసు నమోదైంది. అమాయకులను కేసులో ఇరికించేందుకు కుట్రపన్నారంటూ ఆమెపై పోలీసులు అభియోగాలు మోపారు. ఆ కేసులో భాగంగా గతంలో గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ఏటీఎస్) ముంబయిలో తీస్తాను అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత ఆమె రెండు నెలల పాటు జైల్లో ఉన్నారు. తనకు బెయిల్ నిరాకరిస్తూ సెషన్స్ కోర్టు, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ తీస్తా సెతల్వాద్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై గత సెప్టెంబర్‌లో ఆమెకు ఊరట లభించింది.
అప్పటి నుంచి మధ్యంతర బెయిల్‌పై ఆమె బయట ఉన్నారు. అయితే ఆమె సాధారణ బెయిల్ కోసం కొద్దిరోజుల క్రితం గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె అభ్యర్థనను గుజరాత్ హైకోర్టు తిరస్కరించడంతో పాటు తక్షణమే లొంగిపోవాలని ఆదేశించింది. అయితే ఈ విషయంలో ఆమెకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఏడు రోజుల పాటు సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే విధించింది. తాజాగా మధ్యంతర బెయిల్‌ను జులై 19 వరకు పొడిగించింది.