జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు. ప్రజా సమస్యలపై పోరాటానికి రెడీ అయ్యారు. వరుసగా దేవాలయాలను దర్శించుకుంటూ మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. ముందుగా తిరుపతి వెంకటేశ్వర స్వామిని, విజయవాడ దుర్గమ్మను చంద్రబాబు దంపతులు దర్శించుకున్నారు. ఆ తర్వాత సింహాచలం అప్పన్నను దర్శించుకున్నారు. చివరిగా శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్నారు. తుఫాను కారణంగా ఆ దర్శనం వాయిదా పడింది. తుఫాను ప్రభావం తగ్గగానే మల్లన్న దర్శనం చేసుకోనున్నారు. మొక్కుబడుల అనంతరం వివిధ సభలలో చంద్రబాబు పాల్గొననున్నారు.
ఈనెల 7న చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఏపీలో అక్రమంగా ఓట్లు తొలగిస్తున్నారని, దొంగ ఓట్లు చేరుస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. ఈ నెల 11నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఈ నెల 11న శ్రీకాకుళం, 12న కాకినాడ, 14న నరసరావుపేట, 15న కడపలో పర్యటిస్తారు. జిల్లాల పర్యటన తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు, పవన్ చర్చిస్తారు. ఉత్తరాంధ్ర మినహా మిగతా జిల్లాల్లో అభ్యర్థుల ఖరారుపై ఇరువురు చర్చించే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర లోకేష్ పాదయాత్ర ముగిసిన తర్వాత మిగిలిన జిల్లా అభ్యర్థుల ఖరారు పై దృష్టి సారించనున్నారు.
ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా టీడీపీ జనసేన కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ఇప్పటికే ఆరు హామీలతో మినీ మేనిఫెస్టోను టీడీపీ రిలీజ్ చేసింది. ఉమ్మడి మేనిఫెస్టో పై సమన్వయ కమిటీ ఇప్పటికే సమావేశం నిర్వహించింది. సమావేశ సారాంశాన్ని ఇప్పటికే అధినేతలకు సమన్వయ కమిటీ తెలియజేసింది. పూర్తి మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం ఉమ్మడి సభలు ఉండే అవకాశం ఉంది. డిసెంబర్ చివరి వారంలో పూర్తిస్థాయిలో మేనిఫెస్టో ప్రకటించే ఛాన్స్ ఉంది. జనవరి నుంచి ఇరువురు నేతలు కలిసి సభలు నిర్వహించనున్నారు.