ఏపీ రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ సీన్ చోటు చేసుకుంది. దశాబ్దం తర్వాత టీడీపీ, జనసేన ఒకే వేదికను పంచుకున్నాయి. ఉత్తరాంధ్ర వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్ దాదాపు పదేళ్ల తర్వాత విజయనగరం పోలిపల్లిలో ఉమ్మడిగా బహిరంగ సభా వేదికపై పాల్గొన్నారు. టీడీపీ అధినేత మొన్నటి వరకు సైలెంట్‌గా ఉండి ఒక్కసారిగా పొలిటికల్ సైరన్ మోగించారు. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ ఏర్పాటు చేశారు.
ఇక ఉత్తరాంధ్ర వేదికగా సాగిన యువగళం విజయోత్సవ సభ ద్వారా టీడీపీ, జనసేన పార్టీలు అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్ని మోగించాయి. బహిరంగ సభకు భారీగా సంఖ్యలో జనం తరలిరావడంతో ఇరు పార్టీలకు పొలిటికల్ మైలేజ్ పెరిగిందనే చర్చ స్టార్ట్ అయింది. అయితే రానున్న ఎన్నికల్లో ఏయే పార్టీకి ఎంతమేరకు ప్లస్ అవుతుందో అనే ప్రచారం కూడా ఊపందుకుంది. అయితే రెండు పార్టీలు సమన్వయంతో అడ్డంకులను దాటుకుని ఎన్నికల్లో గెలుపు దిశగా అడుగులు వేస్తున్నాయి.
మరో వైపు వైసీపీలో ఎమ్మెల్యేల మార్పులు, చేర్పులు, నేతలపై నెగెటివ్ ప్రభావం తమకు ప్లస్ పాయింట్స్ అంటోంది టీడీపీ, జనసేన. వైసీపీ శిబిరంలోని నేతల అసంతృప్తి తమకు కలిసివస్తోందనే ధీమాను వ్యక్తం చేస్తోంది. 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో జగన్ వేవ్ ఉన్నప్పటికీ నాలుగు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. అయితే ఈ సారి ఉత్తరాంధ్ర మీదనే మిత్ర పార్టీలు ఫోకస్ పెట్టాయి. వైసీపీ నేతల మైనస్ పాయింట్స్ ఎత్తిచూపుతూనే తమ స్పీచ్‌లు ఇచ్చారు నేతలు.
ఇక సీఎం జగన్ ఇవాళ విశాఖలో పర్యటించనుండడంతో ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తిగా మారనున్నాయి. టీడీపీ, జనసేన సంయుక్త బహిరంగ సభపై ఏ విధంగా స్పందించబోతున్నారది ఇంట్రెస్టింగ్‌గా మారింది. దీంతో జగన్ టార్గెట్ ఎలా ఉండబోతుందనే టాక్ పొలిటికల్ సర్కిల్‌లో జరుగుతోంది. అయితే నిన్నటి టీడీపీ బహిరంగ సభ ద్వారా.. వైసీపీలో వ్యూహాలు మారుతున్నాయా అనే చర్చ స్టార్ట్ అయింది. గెలుపు కోసం చేయాల్సిన అన్ని అంశాలపై జగన్ టీమ్ ఫోకస్ పెట్టింది. ఏదేమైనా అన్ని రాజకీయ పార్టీలు ఉత్తరాంధ్ర మ్యాజిక్ ఫిగర్‌ను టార్గెట్‌గా పెట్టుకున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.