హస్తం ప్రచార హోరు.. ఇవాళ తెలంగాణకు రాహుల్, ప్రియాంక గాంధీ, వచ్చే ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలుపు లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ ఆ పార్టీ జాతీయ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీ తెలంగాణకు రాబోతున్నారు. మొదటి విడతలో మూడు రోజుల పాటు కాంగ్రెస్ బస్సు యాత్ర కొనసాగనుంది. సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో రాహల్, ప్రియాంకగాంధీ బేగంపేట్ చేరుకొనున్నారు. అక్కడ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో రామప్ప ఆలయానికి చేరుకుంటారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను శివుడి మందు ఉంచి ప్రత్యేక పూజలు చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ బస్సు యాత్రను ప్రియాంక, రాహుల్‌గాంధీ ప్రారంభిస్తారు. రామప్ప గుడి నుంచి కాంగ్రెస్ బస్సు యాత్ర ములుగుకి చేరుకుంటుంది. అక్కడ మహిళలతో నిర్వహించే బహిరంగ సభలో రాహుల్, ప్రియాంక పాల్గొంటారు.
నేతల మధ్య ఐక్యత చాటేలా బస్సు యాత్ర ఉండబోతోంది. బస్సు యాత్రలో టీ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు పాల్గొననున్నారు. ములుగు సభ తరువాత తిరిగి ప్రియాంకగాంధీ ఢిల్లీ వెళ్లనున్నారు. ములుగు బహిరంగ సభ నుంచి రాహుల్ గాంధీతో భూపాలపల్లికి బస్సు యాత్ర చేరుకుంటుంది. భూపాలపల్లిలో నిరుద్యోగ యువతతో కలిసి రాహుల్ గాంధీ ర్యాలీ నిర్వహించనున్నారు. రాత్రికి భూపాలపల్లిలోనె రాహుల్ బస చేయనున్నారు.
గురువారం తిరిగి భూపాలపల్లి నుంచి మంథనికి కాంగ్రెస్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. సింగరేణి కార్మికులతో, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉద్యోగ సంఘాల నాయకులతో రాహుల్‌గాంధీ మాట్లాడనున్నారు. మంథనిలో పాదయాత్ర చేయనున్నారు. మంథని నుంచి పెద్దపల్లికి, పెద్దపల్లి నుంచి కరీంనగర్ వరకు యాత్ర ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. అనంతరం కరీంనగర్లో పాదయాత్ర చేసి రాత్రికి అక్కడే రాహుల్‌గాంధీ బస చేయనున్నారు.
శుక్రవారం కరీంనగర్ నుంచి బోధన్ ఆర్మూరు మీదుగా నిజామాబాద్ వరకు కాంగ్రెస్ బస్సు యాత్ర కొనసాగనుంది. బోధన్‌లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని రాహుల్ సందర్శించనున్నారు. ఆర్మూరులో కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం పసుపు, చెరుకు రైతులతో రాహుల్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. నిజామాబాద్‌లో పాదయాత్రతో మొదటి విడత బస్సు యాత్రకు ముగింపు పలకనున్నారు.