తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ తమ మేనిఫెస్టోలను ప్రకటించి.. ప్రచారంలో దూసుకుపోతున్నాయి. బీజేపీయే ప్రకటించలేదు. మరో 15 రోజుల్లో ఎన్నికలు వచ్చేస్తున్నాయి. ఇప్పటికీ మేనిఫెస్టో ప్రకటించకపోతే ఎలా అన్న ప్రశ్నకు సమాధానంగా… ఈనెల 17న కేంద్ర హోమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా ద్వారా మేనిఫెస్టోని రిలీజ్ చేయించాలని బీజేపీ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది.
ఈసారి బీజేపీ బీసీ నినాదం ఎత్తుకుంది. మేనిఫెస్టోలో కీలక అంశాలపై ఫోకస్ చేస్తూ ఉండబోతోందన్నది కొత్త విషయం. కాంగ్రెస్ ఇప్పటికే 6 గ్యారెంటీ పథకాలు ప్రకటించింది. అందుకే బీజేపీ.. ప్రధాని మోడీ గ్యారెంటీ పేరుతో మేనిఫెస్టో తేబోతోందంటున్నారు.
బీజేపీ మేనిఫెస్టో కచ్చితంగా కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు కొంత భిన్నంగానే ఉండబోతుందంటున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 10 లక్షల వరకూ ఉచిత వైద్యం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అర్హులైన పేదలకు ఇల్లు, పెళ్లైన ప్రతీ మహిళకూ సంవత్సరానికి 12వేలు, 500లకే గ్యాస్ సిలిండర్, తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, జన ఔషధీ కేంద్రాల ఏర్పాటు, రైతులకూ, మహిళా సంఘాలకూ వడ్డీ లేని రుణాలు, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 20వేలు, TSPSC పరీక్షలకు జాబ్ క్యాలెండర్ వంటి హామీలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుంది. ఇందులో భాగంగానే.. ఈనెల 17 నుంచి తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేతలు రానున్నారు. 6 రోజుల పాటు తెలంగాణలో రాహుల్ గాంధీ మకాం వేయనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ పర్యటించనున్నారు. 17న పాలకుర్తి, వరంగల్, భువనగిరిలో రాహుల్ సభలు ఉండేలా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రతి నియోజకవర్గం నుండి ముఖ్యనేత పర్యటించేలా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, కర్ణాటక ముఖ్యమంత్రులు కూడా తెలంగాణలో పర్యటించి కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపనున్నారు.